శ్రీ శివ మహా పురాణము - 395


🌹 . శ్రీ శివ మహా పురాణము - 395 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 18

🌻. కాముని విజృంభణము - 3 🌻


శివుడిట్లు పలికెను-

ఇది ముఖమా? చంద్రుడా? ఇవి నేత్రములా? కలువలా? ఇవి కనుబొమలా? మహాత్ముడగు మన్మథుని ధనస్సులా? (31) ఇది అధరమా? దొండపండా? ఇది నాసికయా ? లేక చిలుక ముక్కు అగునా? ఆహా! ఏమి కంఠధ్వని? కోకిల గీతమును పోలియున్నది. ఈమె నడుము అగ్ని హోత్రవేది వలె సన్నగా నున్నది (32). ఈమె నడకను ఏమని వర్ణించెదను? ఈమె రూపమును ఎన్నిసార్లు వర్ణించెదను? ఈమె ధరించిన పుష్పములను, వస్త్రములను ఏమని వర్ణించగలను? (33) సృష్టిలోని సౌందర్యము అంతయూ ఒక్కచోట ప్రోగు చేసినట్లున్నది. ఈమె అవయవములు పూర్ణ రమణీయములనుటలో సందియము లేదు (34).

అహో! అద్భుతమగు రూపముగల ఈ పార్వతి ధన్యురాలు. ఇంతటి సుందరి ముల్లోకములలోనైననూ మరియొక స్త్రీ లేదు (35). అద్భుతమగు అవయవములను కలిగియున్న ఈమె మంచి లావణ్యమునకు నిధియై యున్నది. గొప్ప సుఖమును వర్ధిల్లజేయు ఈమె మునులనైననూ మోహపెట్టగలదు (36).

హరుడు ఈ విధముగా అనేక పర్యాయములు ఆమె అవయవములను వర్ణించి, బ్రహ్మ ఇచ్చిన వరమును గుర్తు చేసుకొని విరమించెను (37). ఓ మహర్షీ ! పార్వతి తన ముఖమును ప్రకటము చేసి, పదేపదే ప్రేమ వీక్షణములతో మహానందముతో చూచుచూ చక్కటి చిరునవ్వుతో కూడి యుండెను (38). ఆమె యొక్క ఆ చేష్టను చూచినవాడై, గొప్ప లీలలు గలవాడు, మహేశ్వరుడునగు శంభుడు మోహమును పొంది ఇట్లు పలికెను (39). ఈమెను చూచినంత మాత్రాన మహానందము కలుగుచున్నది. ఈమెను నేను కౌగిలించుకున్నప్పుడు ఎంతటి సుఖము కలుగునో గదా! (40)

మహాయోగి యగు ఆ శివుడు క్షణకాలము ఇట్లు అలోచించి, తరువాత పార్వతిని ఆదరించెను. ఆయన తెలివిని పొంది (మోహమును వీడి) గొప్ప వైరాగ్యము గలవాడై ఇట్లు అనుకొనెను (41). ఏమైనది? చిత్రమగు ఘటన జరిగినది. నేను మోహితుడనైతిని యేమి? నేను సమర్థుడను, ప్రభుడను అయి ఉండియూ, ఈనాడు కామునిచే వికారమును పొందునట్లు చేయబడితిని (42). ఈశ్వరుడనగు నేనే పరస్త్రీని సృశించ గోరినచో, ఇతరులగు సామాన్య ప్రాణులు ఏ పనిని చేయుటకు తగరు? ఏయే పనులను చేయకుందురు? (43) సర్వప్రాణుల ఆత్మభూతుడగు ఆ పరమేశ్వరుడు 'దీనివలన ప్రయోజనమేమున్నది?' అని నిశ్చయించుకొని, వైరాగ్యము నాశ్రయించి, ఆమెను పొందవలెననే ఆకాంక్షను నివారించుకొనెను (44).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి పార్వతీ ఖండములో కాముడు వికారములను కలిగించుట అనే పదునెమిదవ అధ్యాయము ముగిసినది (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


08 May 2021

No comments:

Post a Comment