గీతోపనిషత్తు -197


🌹. గీతోపనిషత్తు -197 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 38

🍀 37. యోగ వికారములు - కర్తవ్య విముఖులకు యోగము లేదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యములను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. 🍀

కచ్చిన్నో భయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠ మహాబాహో విమూఢ బ్రహ్మణః పథి || 38

అర్జునుడు తన పరిప్రశ్నము నింకను కొనసాగించెను. ఉభయభ్రష్టుడు చెదిరిన మేఘమువలె నశించిపోవును గదా?అందువలన యోగమార్గము ననుసరించు అయతి ఇహపరములను మోసము చెంది నశించును గదా? ప్రస్తుత కాలమున ప్రతివారును యోగవిద్య యందు ప్రవేశించి యోగులు కావలెనని ఆకాంక్షించు చున్నారు.

ఇట్టి ఆకాంక్షను ఆవేశ మావరించి కర్తవ్య విముఖులగు చున్నారు. కర్తవ్య విముఖులకు యోగము లేదు. కర్తవ్యము నుండి పారిపోవు వారికి యోగము కుదరదు. కర్తవ్యములను తప్పించుకు తిరుగు వారికి యోగము కుదరదు. కర్తవ్య నిర్వహణమున వక్రబుద్ధిని ప్రదర్శించు వారికి యోగము కుదరదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యము లను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే.

అందువలన ప్రపంచమును మోసగించుచు యోగము సాధించుటకు వీలుపడదు. కుటుంబ పోషణము, సంఘము నందు వృత్తి ఉద్యోగ వ్యాపార మార్గమున సహకారము, జీవుల ఎడల కారుణ్యబుద్ధి, తలిదండ్రుల ఎడల భక్తి ఇత్యాదివి లేకుండ యోగ ప్రవేశము నిష్ఫలము. కర్మ ఫలములను ఆశ్రయించుచు యోగాభ్యాసము చేయువానికి మనసు నిలుకడగ నుండదు.

మిక్కుటమగు ఇష్టాయిష్టములందు కొట్టు మిట్టాడువానికి యోగము జరుగదు. అట్టి వానికి ప్రశాంతత యుండదు. తటస్థబుద్ధి, సమబుద్ధి అనునవి మృగ్యములై, రాగ ద్వేషములతో జీవించును. సంకల్పములు పుట్టలు పుట్టలుగ వచ్చు చుండగ యోగాభ్యాసము చేసి ఉపయోగము లేదు. యోగవిద్య సత్వగుణ సంబంధితము. రజస్తమస్సుల కది అందదు. రజోగుణ ప్రేరితుడైన వాని నుండి నిత్యము సంకల్పములు కోకొల్లలుగ వచ్చుచుండును.

అవి మానవుని బాహ్య ప్రపంచములోనికి నెట్టు చుండును. ఇట్టివాడు యోగము పేరున కర్తవ్య నిర్వహణము మాని భ్రష్టుడగుట జరుగును. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. సోపాన క్రమమును పాటింపక అడ్డదిడ్డముగ తోచినది చేయువారు యోగ సాధకుల మని భ్రమపడుటయే గాని, యోగము సిద్ధింపనేరదు.

అక్షరములను సరిగ నేర్వక గ్రంథములను రచింతునని పూనుకున్నట్లుండును. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్లు, యోగ సాధన పేరున రకరకములుగ వికారములు ప్రకటింపబడు చుండును. ఇవి యన్నియు నరజాతి పోకడలు. అర్జునుడు నరుడగుటచే నరుల ప్రతినిధిగ ఈ పరిప్రశ్నమును చేసెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 May 2021

No comments:

Post a Comment