రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 19
🌻. కామదహనము - 2 🌻
ఇంతలో దేవతలు స్తుతించుచుండగనే మిక్కిలి క్రుద్ధుడైన శివుని మూడవ కంటి నుండి అపుడు గొప్ప అగ్ని పుట్టెను (14). లలాటమధ్యమునందున్న కంటి నుండి క్షణములో పుట్టిన ఆ అగ్ని ఎత్తైన జ్వాలలతో ప్రళయకాలాగ్నితో సమానమైన తేజస్సు గలదై మండజొచ్చెను (15). మన్మథుడు వెంటనే అంతరిక్షములోనికి ఎగిరి నేలపై బడి క్రిందనే చుట్టూ దొర్లుచుండెను (16). ఓ మహర్షీ! క్షమించుడు, క్షమించుడు అనే దేవతల వచనములు వినబడునంతలో ఆ అగ్ని మన్మథుని బూడిదగా మార్చివేసెను (17).
వీరుడగు ఆ మన్మథుడు మరణించగా దుఃఖితులైన దేవతలు 'అయ్యో! ఏమైనది?' అని ఆక్రోశించువారై ఏడ్వ జొచ్చిరి (18). అపుడు పార్వతీ దేవి యొక్క శరీరము వివర్ణమాయెను. ఆమె మనస్సు వికారమును పొందెను. అపుడామె తన సఖురాండ్రను వెంటబెట్టుకొని తన ప్రాసాదమునకు వెళ్లిపోయెను (19). అపుడచట రతీదేవి భర్త మరణించుటవలన కలిగిన దుఃఖముచే వెనువెంటనే మరణించిన దానివలె నేలపై స్పృహతప్పి పడిపోయెను (20). తెలివి రాగానే రతి మిక్కిలి దుఃఖితురాలై అనేక వచనములను బిగ్గరగా పలుకుచూ విలపించెను (21).
రతి ఇట్లు పలికెను-
నేనేమి చేయుదును? ఎక్కడకు పోదును? ఈ దేవతలీనాడు ఎట్టి పనిని చేసిరి? నా భర్తను బలాత్కారముగా తీసుకువచ్చి నాశము జేసిరి (22). హా! హా! నాథా! మన్మథా! స్వామీ! నీవు నాకు ప్రాణప్రియుడవు. సుఖమునిచ్చిన వాడవు. ఇచట ఏమైనది? అయ్యో! అయ్యో! ప్రియా! ప్రియా! అని ఆమె రోదించెను (23).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆమె ఇట్లు విలపించుచున్నదై అనేక వచనములను పలుకజొచ్చెను. మరియ అపుడామె చేతులను, కాళ్లను కొట్టుకొనుచూ జుట్టును పీకుకొనెను (24). అపుడచటి వనచరులందరు ఆమె రోదనమును విని దుఃఖితులైరి. ఓ నారదా! వృక్షములు, వనములోని మృగములు కూడ దుఃఖించినవి (25). ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలందరు అచటకు వచ్చి మహేశ్వరుని స్మరించుచున్నవారై రతీదేవిని ఓదార్చుచూ ఇట్లు పలికిరి (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 May 2021
No comments:
Post a Comment