✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 61. గ్రద్ద కన్ను 🌻
యోగి యొకరు తన ఆశ్రమమున వస్తువుల అమరికను సున్నితముగ మార్పు చేయుచుండెను. అంతేవాసులు, అనుయాయులు సామాన్యముగ వీనిని గమనింపరు. అతి చిన్న మార్పును గూడ గమనించు అంతేవాసిని అతడంతరంగమున అంగీకరించి, ఆశీర్వదించి ప్రత్యేక బోధనలు, రహస్యార్థములు తెలుపుచుండెడివాడు. ఇతరులకు సామాన్య విషయములు తెలుపుతుండెడివాడు.
ఒకనాడు యోగి గారి సహాధ్యాయి ఒకరు ఆశ్రమమున కేతెంచెను. యోగి రహస్యముగ చేయుచున్న మార్పులను గమనించెను. మార్పులన్నియు అర్థరాత్రమున జరుగుచుండెడివి. గమనించిన మిత్రుడు యోగి వింత ప్రవర్తనమును గూర్చి ప్రశ్నించెను. యోగి యిట్లనెను.
"గ్రద్ద కన్ను కలవారికే నా ఆశ్రమమున నిజమైన ప్రవేశము అనుమతింపబడును. భౌతిక ప్రవేశము అంతరంగ ప్రవేశము కాజాలదు. పరిశీలనా స్వభావము లేనివానికి మహత్తర విషయములు బోధించి లాభము లేదు. చెముడు, గ్రుడ్డి గలవారితో ఎంత శ్రమించినను శ్రవణ, దృశ్యముల అనుభూతి వారికి కలుగదు గదా!
అత్యంత స్వల్పమైన మార్పును కూడ పరిశీలనా దృష్టితో చూడగల ఒక్క అనుయాయి ఉన్ననూ, నా యందుగల విద్యను అతని కందించి ఋషి ఋణమును తీర్చుకొనుచున్నాను. పరిసరముల యందు జరుగు మార్పులు, అట్టి మార్పుల ప్రభావము తెలియుటకు వలసినది శ్రద్ధ, అప్రమత్తత. అందుకే యీ అర్థరాత్రి శ్రమ.” యోగులిద్దరును నవ్వుకొనిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 May 2021
No comments:
Post a Comment