దేవాపి మహర్షి బోధనలు - 104


🌹. దేవాపి మహర్షి బోధనలు - 104 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 85. ఒక రహస్యము 🌻


నీకు నీవే సహాయపడుము. ఇతరులకు కూడ సహాయ పడుము. వీలున్నంత వరకు సహాయము నర్థింపకుము. ఇది యొక శాసనము. తనకుతాను సహాయపడువాడే ఇతరులకు కూడ సహాయ పడగలడు. పూర్వము ఒక మహారాజు వుండెడివాడు. అతనికి నిద్ర పట్టుట లేదు. రాజగురువును పిలిచి తన పరిస్థితిని వివరించినాడు. రాజగురువు రాజును నిర్దేశించి “నీ నిద్రించు పాన్పు ఒక్కసారి పరిశీలింపుము" అని పలికెను.

రాజు భటులను పిలిచి పాన్పు పరిశీలింప చేసెను. అందొక రాతి బెడ్డ యున్నది. వారది చూపించి నారు. అదియే కారణమైయుండునని భావించి రాజు మరునాడు పాన్పుపై పరుండెను. ఆ రాత్రియు రాజుకు నిద్దుర పట్టలేదు. రాజు గురువును మరల ప్రశ్నించెను. రాజగురువు మరల అదే సమాధాన మిచ్చెను. రాజు మరల పాన్పును పరిశీలింపచేసెను. తలగడ క్రింద చచ్చిన బల్లి యొకటి కనపడెను. రాజు భటులపై కోపించెను. మరుసటి రాత్రి మరల నిద్రించెను. నిద్దుర పట్టలేదు. రాజు విసుగు చెందెను. రాజు గురువును కారణమేమి యని అడిగెను. గురువిట్లనెను.

“రాజా నీ పరుపును నిన్ను పరిశీలించుకొనమంటిని. ఆ పని నీ వొకరికి అప్పచెప్పితివి. నీ కన్నులతో నీవే పరిశీలించుకొనుట మంచిది. నీ వట్లు చేయుట లేదు. అదియే కారణము” అని పలికెను. ఆ రాత్రి రాజు తానుగపాన్పును క్షుణ్ణముగ పరిశీలించెను. అందొక అయస్కాంతమున్నది. ఆశ్చర్యపడినాడు. దానిని తీసివేసి నిద్ర కుపక్రమించెను. నిద్రించెను. మరునాడు ఉదయమే రాజ గురువు వచ్చి నిద్ర పట్టినదా? యని యడిగెను. రాజు నవ్వుచు సంతృప్తిగ తలవూపెను. రాజ గురువు యిట్లనెను. “కారణము అయస్కాంత మను కొనుచున్నావా? కాదు సుమా! నీ పని నీవు చేసుకొనుటయే నీ నిదురకు కారణము.” తమ పని తాము చేయనివారికి నిదుర పట్టదు. చేయించుకొను వారికసలే పట్టదు. తమకు, యితరులకు కూడ సహాయము చేయుచు శ్రమించువారికి నిదుర పట్టును. ఇదియొక రహస్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Jun 2021

No comments:

Post a Comment