✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 3
🍀 2. స్వభావము - అక్షరము, పరము అయినది బ్రహ్మము. అది ఆత్మగ నేర్పడుట స్వభావము. ఆత్మ నుండి సమస్త ప్రాణులు, వస్తువులు లోకాలోకములుగ ఏర్పడుట కర్మము. తానున్నాడని తెలియుటయే ఆత్మ తత్త్యము. తానుండియు, తన యందు తాను ఇమిడిపోవుట సమాధి. అది పరము, బ్రహ్మము అని తెలుపబడినది. ఉన్నవాడు మేల్కాంచినపుడు తానున్నాడని తెలియుచున్నది. ఇట్లు మేల్కాంచుట తన స్వభావము. ఇట్టి మేల్కాంచిన స్థితిని ఆధ్యాత్మ మందురు. అనగా ఆత్మగ మేల్కాంచి, తనను తాను అధిష్ఠించి యుండును. జీవునకు తన కర్మ మెట్లు అనివార్యమో, విశ్వాత్మకు సృష్టికర్మ అట్లే అనివార్యము. 🍀
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో? ధ్యాత్మ ముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞాతః I 3
తాత్పర్యము :
అక్షరము, పరము అయినది బ్రహ్మము. అది ఆత్మగ నేర్పడుట స్వభావము. ఆత్మ నుండి సమస్త ప్రాణులు, వస్తువులు లోకాలోకములుగ ఏర్పడుట కర్మము.
బ్రహ్మము విశ్వాత్మగ ఏర్పడుట దాని స్వభావమై యున్నది. అట్లేర్పడుటనే బ్రహ్మము ఆత్మ అగుట అని అందురు. నిద్ర నుండి మేల్కాంచినవాడు తానున్నానని తెలియుచున్నది కదా! తానున్నాడని తెలియుటయే ఆత్మ తత్త్యము. అట్లు తెలియుటకు ముందెట్లున్నాడు? సమాధియందున్నాడు లేక నిద్ర యందున్నాడు. తానుండియు, తనయందు తాను ఇమిడిపోవుట సమాధి. అది పరము, బ్రహ్మము అని తెలుపబడినది.
ఉన్నవాడు మేల్కాంచినపుడు తానున్నాడని తెలియుచున్నది. ఇట్లు మేల్కాంచుట తన స్వభావము. ఇట్టి మేల్కాంచిన స్థితిని ఆధ్యాత్మ మందురు. అనగా ఆత్మగ మేల్కాంచి, తనను తాను అధిష్ఠించి యుండును. దీనినే బ్రహ్మము ఆత్మగ మారుట యందురు. ఇది బ్రహ్మము యొక్క స్వభావము.
మన యందు కూడ ఈ స్వభావము కారణముగనే మేల్కొనుట యుండును. మేల్కొనిన వెంటనే ఆత్మ నుండి ఇచ్ఛా జ్ఞాన క్రియలు ఉత్పన్న మగుచుండును. అట్లే బ్రహ్మము విశ్వాత్మగ మేల్కాంచి నపుడు అతని నుండి ఇచ్ఛా జ్ఞాన క్రియలుత్పన్నమై, సృష్టి కర్మ ప్రారంభమగును. ఇట్లు ఆత్మకు కర్మము అనివార్యమై యుండును.
మేల్కాంచిన జీవుడు కూడ కర్మ సంగమున యుండుట సహజము. కనుకనే పరమాత్మ అక్షరము, పరము అగు బ్రహ్మము అయి ఉన్నను స్వభావతః ఆత్మయగుట, ఆత్మకర్మముతో కూడి యుండుట సహజమని తెలియజెప్పు చున్నాడు. జీవునకు తనకర్మ మెట్లు అనివార్యమో, విశ్వాత్మకు సృష్టికర్మ అట్లే అనివార్యము. బ్రహ్మము, ఆత్మ, కర్మము అను మూడు అంశములను ఈ శ్లోకమున వివరించుట జరిగినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jun 2021
No comments:
Post a Comment