శ్రీ శివ మహా పురాణము - 411
🌹 . శ్రీ శివ మహా పురాణము - 411🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 23
🌻. దేవతలు శివుని దర్శించుట - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! శివుని పొందుట కొరకై పార్వతి ఈ విధముగా తపస్సు చేయుచుండగా చాలా కాలము గడిచిపోయెను. కాని శివుడు సాక్షాత్కరించలేదు (1). అపుడు హిమవంతుడు భార్యతో, కుమారులతో, మంత్రులతో గూడి అచటకు వచ్చి, దృఢనిశ్చయముగల, పరమేశ్వరియగు పార్వతితో నిట్లనెను (2).
ఓ పార్వతీ! నీ భాగ్యము గొప్పది. నీవు ఇట్లు తపస్సును చేస్తూ ఖేదమును పొంందకుము. అమ్మాయీ! రుద్రుడు కానవచ్చుట లేదు. ఆయన విరాగియనుటలో సందియము లేదు (3). నీవు సుకుమారమగు అవయవములు గలదానవు. కృశించి యున్నావు. నీవు స్పృహను కోల్పోయెదవు. దీనిలో సందేహము లేదు. నేను నీకు ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (4).
ఓ అందమైనదానా! కావున నీవు లేచి, నీ ఇంటికి రమ్ము. పూర్వము మన్మథుని బూడిదగా చేసిన ఆరుద్రునితో నీకు పనియేమి? (5) ఓ దేవదేవీ! ఆయన వికారము నెరుంగనివాడు. కావున ఆ శివుడు నిన్ను వివాహ మాడుటకు రాబోడు. ఆయనను నీవు ఎట్లు ప్రార్థించెదవు? (6) ఆకాశమునందున్న చంద్రుని పట్టుకొనుట సంభవము కాదు. ఓ పుణ్యాత్మురాలా! శివుడు కూడ అటులనే పొంద శక్యము కానివాడని తెలుసుకొనుము (7).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మేనాదేవి, సహ్య పర్వతుడు, మేరువు, మందరుడు, మైనాకుడు (8), మరియు క్రౌంచుడు మొదలగు ఇతర పర్వతములన్నియు అనేక యుక్తులను పలికి ఆమెను అదే తీరున కోరిరి. అయిననూ పార్వతి కంగారుపడలేదు (9). వారందరు తపస్సును చేయుచున్న ఆ సుందరితో నిట్లు పలుకగా, స్వసచ్ఛమగు చిరునవ్వు గల ఆ పార్వతి నవ్వుచున్నదై హిమవంతునితో నిట్లనెను (10).
పార్వతి ఇట్లు పలికెను-
తండ్రీ! పూర్వము మీకు చెప్పియుంటిని. తల్లీ! నీవు మరచితివా యేమి! బంధులారా! ఇప్పుడైననూ నా ప్రతిజ్ఞను వినుడు (11). ఈ మహాదేవుడు విరాగి. ఆయన కోపించి మన్మథుని భస్మము చేసినాడు. భక్త వత్సలుడగు అట్టి శంకరుని తపస్సు చేసి సంతోషపెట్టెదను (12). మీరందరూ ఆనందముగా మీ మీ గృహములకు వెళ్లుడు. శివుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. ఈ విషయములో చర్చను చేయ తగదు (13). ఏ శివుడు మన్మథుని, హిమవంతుని వనమును తగులబెట్టినాడో, అట్టి శివుని కేవలము తపః ప్రభావముచే ఇదే స్థానమునకు తీసుకొని వచ్చెదను (14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment