గీతోపనిషత్తు -215


🌹. గీతోపనిషత్తు -215 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚


శ్లోకము 5 - 2

🍀 4-2. సంకల్పము - అక్షరమగు బ్రహ్మముతో కూడుటకు చేయు ప్రయత్నమున, క్షరలోకము నుండి అక్షరలోకము లోనికి మార్గము ప్రజ్ఞ కవగత మగును. అట్లవగతమైనపుడు మృత్యువొక మార్పని తెలియును. ఒక అంతస్తు నుండి మరియొక అంతస్తు లోనికి చనినట్లు క్షరలోకముల నుండి అక్షర లోకముల లోనికి చనవచ్చును. నిద్రా సమయమున అంత్యకాలముగ భావించి అక్షరము, పరము అయిన బ్రహ్మమును చేరుటకు సంకల్పించి, తనయందలి ఈశ్వరునితో అనుసంధానము చెందవలెను. ఇట్టి నిత్య ప్రయత్నమున అక్షర పరబ్రహ్మయోగము సిద్ధించును. 🍀

అంతకాలే చమామేవ స్మరమ్మక్యా కలేబరమ్ |
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5


తాత్పర్యము :

అంత్యకాలమందు నన్నే స్మరించుచు శరీరమును విడిచినవాడు నా భావమునే (స్వరూపమును) పొంద గలడు. ఈ విషయమున సందేహము లేదు.

వివరణము :

అనగా మృత్యువు నుండి విడిపడుటయేగాని, మృత్యు వనుభ వించుట కాదు. నిత్యము బ్రహ్మ భావముతో నిద్రకుపక్రమించుట వలన నిద్ర మాధ్యమముగ పరలోక గమనము సాధన మార్గమున జరుగును. నిత్యసాధన వలన ప్రజ్ఞకు మృత్యువు లేదని తెలియును.

అక్షరమగు బ్రహ్మముతో కూడుటకు చేయు ప్రయత్నమున, క్షరలోకము నుండి అక్షరలోకము లోనికి మార్గము ప్రజ్ఞ కవగత మగును. అట్లవగతమైనపుడు మృత్యువొక మార్పని తెలియును. ఒక అంతస్తు నుండి మరియొక అంతస్తు లోనికి చనినట్లు క్షరలోకముల నుండి అక్షర లోకముల లోనికి చనవచ్చును.

కేవలము మృత్యువాసన్న మైనపుడు ఈ ప్రయత్నము సిద్ధించదు. పూర్వాభ్యాసము వలన సిద్దించును. కనుక నిద్రా సమయమున అంత్యకాలముగ భావించి అక్షరము, పరము అయిన బ్రహ్మమును చేరుటకు సంకల్పించి, తనయందలి ఈశ్వరునితో అనుసంధానము చెందవలెను. ఇట్టి నిత్య ప్రయత్నమున అక్షర పరబ్రహ్మయోగము సిద్ధించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Jun 2021

No comments:

Post a Comment