శ్రీ శివ మహా పురాణము - 415
🌹 . శ్రీ శివ మహా పురాణము - 415🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 23
🌻. దేవతలు శివుని దర్శించుట - 5 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
సర్వసమర్థుడగు విష్ణువు ఇట్లు పలుకగా, దేవతలందరు అపుడు విష్ణువుతో గూడిపినాకధారియగు శివుని చూచుటకు వెళ్లిరి (42). విష్ణువు మొదలుగా గల వారందరు ముందుగా పార్వతి యొక్క తపస్సును చూచు కుతూహలము గలవారై మార్గమునందున్న ఆమె ఆశ్రమమునకు వెళ్లిరి (43).
పార్వతి యొక్క గొప్ప తపస్సును చూడగానే వారందరు తేజస్సుచే వ్యాప్తులైరి. వారప్పుడు జగన్మాత, తేజస్స్వరూపిణి, తపోనిష్ఠురాలు అగు ఆమెకు ప్రణమిల్లిరి (44). మూర్తీభవించి తపస్సిద్ధివలె నున్న ఆమె యొక్క తపస్సును కొనియాడుతూ, ఆ దేవతలు తరువాత వృషభధ్వజుడగు శంకరుడు ఉన్నస్థానమునకు వెళ్లిరి (45).
ఓమహర్షీ! అపుడా దేవతలు అచటకు చేరి శివుని వద్దకు నిన్ను పంపిరి. కాముని భస్మము చేసిన శివునకు వారు దూరముగా నుండి చూచుచుండిరి (46).
ఓనారదా! అపుడు భయమునెరుంగని నీవు శివుని స్థానమునకు వెళ్లి యుంటివి . విశేషించి శివభక్తుడవగు నీవు అపుడు ప్రసన్నుడై యున్న అ ప్రభుని చూచితివి (47). నీవు అపుడు తిరిగి వచ్చి విష్ణువు మొదలగు దేవతలను పిలిచి ప్రయత్న పూర్వకముగా శంకరుని వద్దకు తీసుకువెళ్లితివి. ఓ మహర్షీ! (48) అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు అచటకు వెళ్లి. సుఖాసీనుడై ప్రసన్నుడై యున్న భక్తవత్సలుడగు శివ ప్రభుని దర్శించిరి(49).
యోగపట్టము (ఒక వేశేష బంధములో నున్న వస్త్రము) నందున్నవాడు, గణములచే పరివేష్టించబడి యున్నవాడు, తపస్సునకు అనుకూలమగు రూపమును ధరించినవాడు, పరమేశ్వర స్వరూపుడు (50) అగు శివుని విష్ణువు, నేను, దేవతలు, సిద్ధులు, మహర్షులు మరియు ఇతరులు నమస్కరించి వేదములతో, ఉపనిషత్తులతో గూడిన సూక్తములతో స్తుతించితిమి (51).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో దేవతలు శివుని దర్శించుట అనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment