✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 6-1
🍀 5-1. ఉత్తమ భావములు - సంస్కారమే జీవుని నడిపించును. కనుక చిత్తమందలి ప్రధాన సంస్కారమును బట్టి అతడి మరుసటి జన్మ యుండును. చిత్తమున ఏర్పడు బలమగు సంస్కారమే కామము. దానివలననే లోకములందలి జీవులందరును నడిపింప బడుచున్నారు. దైవకామ మేర్పడుట, ధర్మకామ మేర్పడుట వలన దైవమును చేరుట ఎట్లో, అట్లే ఇతర కామములు జీవులను ఆయా గతులలో నడిపించుచున్నవి. సాధకులు తమ చిత్త మందలి సంస్కారములను పరిశీలించుకొని, అను నిత్యము ఉత్తమ సంస్కారములకై కృషి సలుపవలెను. ఉత్తమోత్తమ సంస్కారము, ఉత్తమోత్తమ లోకములకు చేర్చగలదు. 🍀
యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కలేబరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6
తాత్పర్యము :
దేహము త్యజించు సమయమున ఎవరెవరు ఏయే భావములను స్మరింతురో అట్టి భావముల లోనికే చను చుందురు.
వివరణము :
మానవుడు నిరంతరము దేని గురించి చింతించు చుండునో అదియే చిత్తమున సంస్కారముగ నేర్పడి, తదనుగుణమైన లోకములను చేరును. సంస్కారమే జీవుని నడిపించును. కనుక చిత్తమందలి ప్రధాన సంస్కారమును బట్టి అతడి మరుసటి జన్మ యుండును.
తన భావము ననుసరించియే తాను మార్పు చెందుచు నుండును. భావము దైవమును గూర్చి ప్రధానముగ నున్నచో తదనుగుణమగు సంస్కారములు చేరును. ధనమును గూర్చి యైనచో తదనుగుణమగు ప్రదేశములు చేరును. ధనకాంక్ష, కీర్తి కాంక్ష, స్త్రీ కాంక్ష ఆయా లోకములకు గొనిపోవును. దైవీకాంక్ష దైవము దరిచేర్చును. మానవుడు తన భావమును బట్టియే భవిష్యత్ మార్గమును నిర్ణయించుకొను చున్నాడు.
నేడు నిద్ర కుపక్రమించునపుడు రేపటి కార్యములను గూర్చిన భావములే మరునా డుదయము భాసించి, ఆయా కార్యముల లోనికి గొనిపోవును. “రేపు ఉదయముననే పొలమునకు పోవలెను" అని భావించుచో మరునాడు నిదుర లేవగనే ఆ భావము భాసించి పొలమునకు పోవుట జరుగును. చిత్త మందలి బలమగు సంస్కారములే తదనుగుణమగు భావములను సృజింప జేసి ఆ యా మార్గములలో నడిపించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Jun 2021
No comments:
Post a Comment