శ్రీ శివ మహా పురాణము - 416
🌹 . శ్రీ శివ మహా పురాణము - 416🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 24
🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 1 🌻
దేవతలిట్లు పలికిరి-
ప్రకాశస్వరూపుడు, మన్మథుని దహించినవాడు, స్తుతింపదగిన వాడు, గొప్ప తేజశ్శాలి, ముక్కంటి అగు రుద్రునకు అనేక నమస్కారములు (1). రశ్ములచే సర్వమును ప్రకాశింపజేయు ఆదిత్యుడు నీవే. భయంకరాకారుడు, భయమును గొల్పు కన్నులు గలవాడు, ప్రభుడు, మహాదేవుడు అగు నీకు నమస్కారము. నీవు ఇంద్రరూపుడవై స్వర్గమును పాలించుచున్నావు (2). లోకములన్నింటికీ నాథుడు, తండ్రి, తల్లి మరియు పాలకుడు నీవే. నీవు మంగళ స్వరూపుడవు, ఈశ్వరుడవు, మంగళముల నిచ్చువాడవు. నీయందు దయ విశేషముగా గలదు (3). హే ప్రభో! లోకములనన్నింటినీ పోషించునీవు మమ్ములను రక్షింప తగుదువు. మహేశ్వరా! దుఃఖమును పొగొట్టుటలో సమర్థుడు నీవు తక్క మరి ఎవ్వరు గలరు? (4)
బ్రహ్మ ఇట్లు పలికెను-
నందికేశ్వరుడు ఆ దేవతల ఈ మాటలను విని గొప్ప దయగలవాడై శంభునితో విన్నపమును చేయుటకారంభించెను (5).
నందికేశ్వరుడిట్లినెను-
విష్ణువు ప్రముఖముగా గల దేవగణములు, మునిగణములు, సిద్ధగణములు నిన్ను చూచుటకై వేచియున్నారు. ఓ దేవోత్తమా! గొప్ప రాక్షసులచే పీడింపబడి, తీవ్రమగు పరాభవమునకు గురియైన వీరలు నీ అనుగ్రహముచే కార్యసిద్ధిని గోరుచున్నారు (6). హే సర్వేశ్వరా! కావున నీవు మనునులను, దేవతలను రక్షించవలెను. నీవు విశేషించి దీనులకు బంధుడవని, భక్తవత్సలుడవని ఖ్యాతిని గాంచినావు (7).
బ్రహ్మ ఇట్లు పలికెను-
దయాళువు అగు నంది ఇట్లు పరిపరివిధముల విన్నవించగా, శంభుడు మెల్లమెల్లగా ధ్యానమునుండి విరమించి కన్నులను తెరచెను (8). అపుడు ఈశ్వరుడు, పరమజ్ఞాని, పరమాత్మయగు ఈ శంభుడు సమాధిని ఉపసంహరించి, దేవతలందరితో నిట్లనెను (9).
శంభుడిట్లు పలికెను-
ఓ దేవతా శ్రేష్ఠులారా! బ్రహ్మ విష్ణువులను ముందిడు కొని మీరందరు నావద్దకు వచ్చుటకు గల కారణము వెంటనే చెప్పుడు (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment