గీతోపనిషత్తు -218


🌹. గీతోపనిషత్తు -218 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚


శ్లోకము 7 - 1

🍀 6 - 1. అనుస్మరణము - ఎల్లకాలముల యందు ఎడతెగక దైవమును స్మరించువారి మనస్సు, బుద్ధి దైవీస్వభావముతో నిండును. అపుడు దృగ్గోచరమగు జగత్తంతయు దైవీ విలాసముగనే గోచరించును. బాహ్యాంతరములందు మనస్సు, బుద్ధి దైవమునే స్మరించుచు దర్శించుచు నుండును. అపుడంతయును దైవమే అయి వుండును. వేరొకటి లేని స్థితి కలుగును. మనోబుద్ధుల యందు దైవస్మరణము నిత్యమగుట వలన ప్రహ్లాదాది భాగవతమూర్తులవలె అన్నిటి యందు దైవమే దర్శన మగును. స్మరణ వలన, సాన్నిధ్యముండుట వలన స్వభావము దైవీ స్వభావముగ మారును. 🍀

తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్య చ |
మయ్యర్పిత మనోబుద్ధి ర్మా మేవైష్య స్యసంశయః || 7


తాత్పర్యము :

సర్వకాలముల యందు నన్నే స్మరించుచు యుద్ధము చేయుచో- నా యందు సమర్పితమైన మనో బుద్ధులు ఏర్పడి, క్రమముగ నన్నే పొందగలవు. ఈ విషయమున సందేహము లేదు.

వివరణము :

భగవానుని పలుకులు సంపూర్ణమగు జ్ఞానము. శోకమందు యుద్ధమును గూర్చి చెప్పబడినది. అనగా జీవితమున కర్తవ్య పాలనమని మన మన్వయించుకొనవలెను. ఎల్లకాలముల యందు ఎడతెగక దైవమును స్మరించువారి మనస్సు, బుద్ధి దైవీస్వభావముతో నిండును. అపుడు దృగ్గోచరమగు జగత్తంతయు దైవీ విలాసముగనే గోచరించును.

అట్లే కనులు మూసుకొనినపుడు అంతరంగమందు కూడ అభ్యాసవశము చేత బుద్ధి దైవమునే దర్శించు చుండును. ఇట్లు బాహ్యాంతరములందు మనస్సు, బుద్ధి దైవమునే స్మరించుచు దర్శించుచు నుండును.

అపుడంతయును దైవమే అయి వుండును. వేరొకటి లేని స్థితి కలుగును. మనోబుద్ధుల యందు దైవస్మరణము నిత్యమగుట వలన ప్రహ్లాదాది భాగవతమూర్తులవలె అన్నిటి యందు దైవమే దర్శన మగును. స్మరణ వలన, సాన్నిధ్యముండుట వలన స్వభావము దైవీ స్వభావముగ మారును. అయస్కాంత సన్నిధిన ఇనుపముక్క అయస్కాంతమైనట్లు, అనుస్మరణము వలన మానవ స్వభావము దైవీ స్వభావమై పరిణమించును.

అట్టి వానికి లోపల వెలుపల అంతట దైవమే గోచరించుట తథ్యము. ఈ శ్లోకమున అనుస్మరణము కీలకమగు ఉపాయముగ తెలుపబడినది. స్మరణము శ్వాసవలె నిరంతరమై యుండవలెను. కనుక శ్వాసతో జతపరచి స్మరణము చేయవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Jun 2021

No comments:

Post a Comment