శ్రీ శివ మహా పురాణము - 418


🌹 . శ్రీ శివ మహా పురాణము - 418🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 24

🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 3 🌻


హే విష్ణో! నేను మన్మథుని దహించి గొప్ప దేవ కార్యమును చేసితిని. మీరందురు నాతో గూడి కామము లేనివారై ఉందురుగాక! ఇది నిశ్చయము (22). ఓ దేవతలారా! మీరందరు ప్రయత్నము లేకుండగనే నావలెనే గొప్ప ఏకాగ్రత గలవారై ఉగ్రమగు తపస్సును చేయుడు (23). ఓ దేవతలారా! మన్మథుడిపుడు లేడు గనుకమీరు పరమానందముతో గూడినవారై వికారములు లేనివారై సమాధినిష్ఠులు కండు (24). ఓ బ్రహ్మా! హే విష్ణో! మహేంద్రా! మునులారా! దేవతలారా! పూర్వము మన్మథుడు చేసిన పనిని మీరు విస్మరించినారు. ఆ వృత్తాంతమునంతనూ విమర్శ చేయుడు (25).

ఓ దేవతలారా! మహాధనుర్ధారి యగు మన్మథుడు పూర్వము హఠాత్తుగా అందరి ధ్యానమును నాశనము చేసినాడు (26). కామము నరకమునకు దారి తీయును. దాని నుండి క్రోధము పుట్టును. క్రోధమునుండి వ్యామోహము పుట్టును. వ్యామోహము వలన తపస్సు భ్రష్టమగును (27).దేవతా శ్రేష్ఠులగు మీరందరు కామక్రోధములను విడనాడడు. నామాటను మననము చేయుడు నామాట ఎన్నటికీ అసత్యము కాబోదు (28).


బ్రహ్మ ఇట్లు పలికెను-

వృషభధ్వజుడు, భగవంతుడు అగు మహాదేవుడు బ్రహ్మ విష్ణువులను, మరియు దేవతలను మునులను ఉద్దేశించి ఈ విధముగా ధర్మమును బోధించెను (29). అపుడాయన మాటలాడుటను విరమించి మరల ధ్యానమగ్నుడై పూర్వములో వలెనే కదలిక లేనివాడై ఉండెను. గణములు ఆయనను చుట్టువారి యుండెను (30). సంగము, భ్రాంతి, వికారము, దోషము లేని ఆత్మతత్త్వమును శంభుడు తన మనస్సుచే తన హృదయము నందు ధ్యానించెను (31).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Jun 2021

No comments:

Post a Comment