గీతోపనిషత్తు -219


🌹. గీతోపనిషత్తు -219 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚


శ్లోకము 7 - 2

🍀 6 - 2. అనుస్మరణము - స్మరణము అనగా మేల్కొని యున్నంత కాలము, పగలనక రాత్రియనక స్మరణ సాగవలెను. దైవమే అందరి యందు తానుగ నున్నాడు గనుక, అతడే నేనుగ నున్నాను అను భావన స్థిరపడుటకే శ్వాసతో జతపరచి “అతడే నేను, అతడే నేను” అని భావించుచు నుండవలెను. నిజమునకు మన యందలి స్పందనము దానినే తెలుపుచున్నది. శ్వాస పీల్చు నపుడు 'సో' అని వినిపించును. శ్వాస వదలినపుడు 'హం' అని వినిపించును. సోహం, సోహం అనుచు శ్వాస నిత్యము గానము చేయుచున్నది. సోహం అనగా సః + అహం. 'స!' అనగా అతడు. 'అహం' అనగా నేను. అతడే నేను అనునది సోహం యొక్క అర్ధము. కనుక శ్వాస ననుసరించుచు స్మరణ చేయుట సాధన. 🍀

తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్య చ |
మయ్యర్పిత మనోబుద్ధి ర్మా మేవైష్య స్యసంశయః || 7


తాత్పర్యము :

సర్వకాలముల యందు నన్నే స్మరించుచు యుద్ధము చేయుచో- నా యందు సమర్పితమైన మనో బుద్ధులు ఏర్పడి, క్రమముగ నన్నే పొందగలవు. ఈ విషయమున సందేహము లేదు.

వివరణము :

సర్వకాలములందు స్మరణము అనగా మేల్కొని యున్నంత కాలము, పగలనక రాత్రియనక స్మరణ సాగవలెను. దైవమే అందరి యందు తానుగ నున్నాడు గనుక, అతడే నేనుగ నున్నాను అను భావన స్థిరపడుటకే శ్వాసతో జతపరచి “అతడే నేను, అతడే నేను” అని భావించుచు నుండవలెను. నిజమునకు మన యందలి స్పందనము దానినే తెలుపుచున్నది. శ్వాస పీల్చు నపుడు 'సో' అని వినిపించును. శ్వాస వదలినపుడు 'హం' అని వినిపించును. సోహం, సోహం అనుచు శ్వాస నిత్యము గానము చేయుచున్నది. సోహం అనగా సః + అహం. 'స!' అనగా అతడు. 'అహం' అనగా నేను. అతడే నేను అనునది సోహం యొక్క అర్ధము. కనుక శ్వాస ననుసరించుచు స్మరణ చేయుట సాధన.

అట్టి శ్వాసకు మూలము స్పందనము. హృదయ స్పందనము కూడ యిదే శబ్దమును వినిపింప జేయును. విచ్చుకోలు - ముడుచు కోలుగ జరుగు స్పందనమున కూడ సోహం వినిపించును. నిద్రావస్థ యందు తప్ప, ఇతర సమయమున యిట్టి దైవస్మరణ మనయందు దైవము నావిష్కరింప జేయును. అన్నికాలముల యందు యిట్టి స్మరణ చేయవలెనని, “సర్వేషు కాలేషు " అని శ్లోకము తెలుపుచున్నది.

అనుస్మరణమను విషయమును కూడ అదియే తెలుపుచున్నది. దైవీభావము నిరంతరమైనపుడు దైవమే తానుగ వెలుగొందుట నిస్సంశయము. అయస్కాంతమును చేరిన ఇనుప ముక్క అయస్కాంతమైనట్లు, స్మరణతో కూడిన జీవుడు దేవునితో ఏకీభావము చెందును. “యద్భావం తద్భవతి "ఎట్లు నిరంతరము భావించిన అధ్యగు ననునది సత్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Jun 2021

No comments:

Post a Comment