శ్రీ శివ మహా పురాణము - 419
🌹 . శ్రీ శివ మహా పురాణము - 419🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 24
🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 4 🌻
ఉత్కృష్టమైన వాటి అన్నింటికంటె ఉత్కృష్టమైనది, నిత్యము, మమకారము లేనిది, శబ్దములకు అందనిది, నిర్గుణము, జ్ఞానము చేత మాత్రమే పొందబడునది (32) అగు పరమాత్మ స్వరూపమును మనస్సులో ధ్యానిస్తూ, ఆ జగత్కారణుడగు శివుడు పరమానంద నిమగ్నడై యుండెను (33). విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలందరు ధ్యానమునందున్న ఆ సర్వేశ్వరుని చూచి, నందీశ్వరుని ఉద్దేశించి వినయముతో నిట్లు పలికిరి (34).
దేవతలిట్లు పలికిరి -
శంభుడు విరక్తుడై ధ్యానము నందున్నాడు. మేమిప్పుడు ఏమి చేయవలెను? నీవు శంకరుని మిత్రుడవు. సర్వము తెలిసిన వాడవు. శుద్ధహృదయము గల సేవకుడవు (35). ఓ గణాధ్యక్షా! ఏ ఉపాయముచే కైలాసపతి ప్రసన్నుడగునో, అట్టి ఉపాయమును చెప్పుము. మేము నిన్ను శరణు పొందుచున్నాము (36).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలు ఈ విధముగా విన్నవించుకొనగా, శంభునకు ప్రియుడైన గణాధ్యక్షుడగు నందీశ్వరుడు ఆ దేవతలకు ఇట్లు ప్రత్యుత్తరము నిచ్చెను (37).
నందీశ్వరుడిట్లు పలికెను-
హే విష్ణో! ఓ బ్రహ్మో! ఇంద్రా! దేవతలారా! మునులారా! శివునకు సంతోషమును కలిగించు మాటను చెప్పెదను. వినుడు (38). ఈనాడే శివుడు వివాహమాడవలెనని మీకు పట్టుదల ఉన్నచో, మీరందరు మిక్కిలి దైన్యముతో ఆదరముతో చక్కని స్తోత్రమును చేయుడు (39). దేవతలారా! సాధారణముగా వశముగాని మహాదేవుడు భక్తికి వశుడగును. ఆ పరమేశ్వరుడు మంచి భక్తిగల వాని విషయములో చేయదగని పనిని కూడ చేసిపెట్టును (40). బ్రహ్మ, విష్ణువు మొదలుగా గల ఓ దేవతలారా! మీరందరు ఈ తీరున చేయుడు. లేదా, ఆలస్యము చేయకుండగా వచ్చిన దారిని వెళ్లుడు (41).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
29 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment