దేవాపి మహర్షి బోధనలు - 98
🌹. దేవాపి మహర్షి బోధనలు - 98 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 78. మధుర మార్గము -2 🌻
మధుర మార్గమునకు జగద్గురువే గురువు. అతడే శ్రీకృష్ణుడు. అతని సాన్నిధ్య స్థితియే మధురానగరము. ఋషులు, దేవర్షులు, దేవతలు, మునులు, యోగులు నిమిత్త కారణములను గైకొని దివ్య మాధుర్యమునకై మధురానగరము వచ్చి పోవుచు నుండెడివారు.
మముబోంట్ల వారి మాట యిక చెప్ప నవసరము లేదు. జగత్తునే మోహింప చేయగల చరితము శ్రీకృష్ణునిది. అతని సాన్నిధ్యము వర్ణనాతీతమగు మాధుర్యము కలిగించును. జీవుల అస్థిత్వమునే మరపింపచేయగల మాధుర్య మాయన సాన్నిధ్యమున నున్నది. గోప స్త్రీలే యన నేల? నారదాది మహర్షులు సైతము, అతని సాన్నిధ్య మాధుర్యమునకై తపన చెందుచుండిరి. అతని చూపు మధురము, నడక మధురము, నవ్వు మధురము, మాట మధురము, చేత మధురము, గానము మధురము, రథసారథ్యము మధురము.
పరవశము కలిగించు అతని రూపమును చూచి మహా భారత యుద్ధమున శత్రువులందరును అతని ముందే చేరిరి. యుద్ధమును గమనించిన మాబోటి వారికిది విదితము. అర్జునుని అస్త్రములచే సంహరింపక మునుపే కృష్ణుని చూపులతో చూపులను కలిపి శత్రువు లతనిని చేరిరి. కేవలము రక్తమాంసాదులతో కూడిన దేహములనే అర్జునుడు వధించెను. యుద్ధమున భీష్ముడొకడే ఇది గమనించెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment