గీతోపనిషత్తు -224



🌹. గీతోపనిషత్తు -224 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 10 - 3

🍀 9 - 3 . ధ్యాన మార్గము - ధ్యాన మార్గ మిట్లున్నది. 🍀


7. ముమ్మారు శ్వాసను సున్నితముగను, దీర్ఘముగను, లోతుగను, నెమ్మదిగను నిర్వర్తించ వలెను. అటు పైన మూడు శ్వాసలు సామాన్యముగ నిర్వర్తించి, మరల మూడు మార్లు దీర్ఘముగ నిర్వర్తించవలెను. అట్లు నిర్వర్తించుట వలన సున్నితముగ జరుగుతున్న స్పందనము తెలియ వచ్చును. అనగా మనసు గ్రహించును. గ్రహింప బడిన స్పందనమున మనోప్రజ్ఞను లగ్నము చేయవలెను. స్పందనమునే గుర్తించుచు, స్పందనముతో కూడి యుండవలెను.

స్పందనము గ్రహింపబడనపుడు మరల ముమ్మారు దీర్ఘముగ శ్వాసను నిర్వర్తించుకొనవలెను. అపుడు మరల స్పందనము స్పష్టమగును. విస్పష్టమైన స్పందనముతో ప్రజ్ఞను కూర్చి యుంచవలెను.

8. నిరంతర అభ్యాసవశమున, ప్రజ్ఞ స్పందనముతో కూడి యుండుట వలన స్పందన ఎరుక ప్రధానమై, శ్వాసయందు ఎరుక తగ్గుముఖము పట్టును. శ్వాసను గూర్చిన భావన నుండి స్పందనను గూర్చిన భావనలోనికి ప్రజ్ఞ ప్రవేశింపగ, బహిర్ముఖమగు మనస్సు అంతర్ముఖమగుట ఆరంభించును. స్పందనముతో కూడియే అంతర్ముఖ మగును.

9. స్పందనముతో కూడి అంతర్ముఖమైన మనస్సు సూక్ష్మ స్పందనమును గ్రహించును. సూక్ష్మ స్పందనమున ప్రజ్ఞ క్రమముగ అభ్యాసవశమున స్థిరపడును. ఇట్లు స్థిరపడుట హృదయమును చేరుట. ఇట్టి సమయమున సూక్ష్మ స్పందనముతో కూడిన ప్రజ్ఞ మనస్సను కక్ష్యను వీడి, హృదయకక్ష్యలో ప్రవేశించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Jul 2021

No comments:

Post a Comment