శ్రీ శివ మహా పురాణము - 424


🌹 . శ్రీ శివ మహా పురాణము - 424🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 25

🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 1 🌻

నారదుట్లు పలికెను-

బ్రహ్మ, విష్ణువు మొదలగు ఆ దేవతలు, మునులు అందరూ ఆనందముతో మరలి వెళ్లిన తరువాత ఏమాయెను? (1)

తండ్రీ! శంభువు ఏమి చేసినాడు? ఆయన ఎంత కాలము తరువాత వరము నిచ్చుటకు వచ్చినాడు? ఎట్లు వచ్చినాడు? ఆ విషయమును చెప్పి ప్రీతిని కలిగించుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను-

బ్రహ్మ మొదలగు ఆ దేవతలు తమ స్థానములకు వెళ్లిన తరువాత, శివుడు ఆమె యొక్క తపస్సును బాగుగా పరీక్షింపగోరి సమాధిలోనికి వెళ్లిపోయెను (3). సర్వము కంటె శ్రేష్ఠమైనది, స్వరూపభూతమైనది, మాయకు అతీతమైనది, ఆటంకములు లేనిది అగు ఆత్మ తత్త్వమును ఆయన మనస్సుతో హృదయమునందు ధ్యానించెను (4). ఆ హరుడు తత్పద వాచ్యమగు వస్తు స్వరూపుడు, భగవానుడు, ఈశ్వరుడు, వృషభము ధ్వజము నందు గలవాడు, తెలియబడని స్వరూపము గలవాడు, సర్వకారణుడు మరియు పరమేశ్వరుడు (5). వత్సా! ఆపుడా పార్వతి ఉగ్రతపస్సును చేయుచుండెను. ఆ తపస్సును గని రుద్రుడు కూడ మిక్కిలి విస్మయమును పొందెను (6).

ఆయన భక్తులకు అధీనుడే గాని మరియొకటి కాదు. ఆయన సమాధి నుంచి చలించెను. జగత్కారణుడగు హరుడు వసిష్ఠాది సప్తర్షులను స్మరించెను (7). ప్రసన్నమగు ముఖము గల సప్తర్షులు స్మరించినంత మాత్రాన తమ భాగ్యమును అనేక విధములుగా వర్ణించుకొనుచున్నవారై విచ్చేసిరి (8). వారు ఆనందభరితులై ఆ మహేశ్వరునకు ప్రణమిల్లి, చేతులు జోడించి, తలలు వంచి, గద్గమగు వాక్కుతో నిట్లు స్తుతించిరి (9).

సప్తర్షులిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! కరుణాసముద్రా! ప్రభూ! నీవీనాడు మమ్ములను స్మరించుటచే మేము మిక్కిలి ధన్యలమైతిమి (10). ఓ స్వామీ! నీవు మమ్ములను దేనికొరకు స్మరించితివి? నీవా విషయమును మాకు ఆజ్ఞాపించుము. నీ దాసులయందు చూపించే కృపవంటి కృపను చూపుము. నీకు నమస్కారమగు గాక ! (11)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Jul 2021

No comments:

Post a Comment