✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 10 - 4
🍀 9 - 4 . ధ్యాన మార్గము - ధ్యాన మార్గ మిట్లున్నది. 🍀
10. ధ్యానమందలి ఈ స్థితి యందు శ్వాస సున్నితముగ సాగుచున్నను ప్రజ్ఞ అంతర్ముఖమై ప్రాణాపానములనుండి విడిపడి, వానికి మూలమైన సమాన ప్రాణ స్పందనమునందు నిలచును. అట్టి స్థితిలో ప్రాణాయామము సిద్ధించినట్లగును. ప్రాణాయామమనగా ప్రాణము యమింపబడుట. అనగా ప్రాణము, అపానము యమింపబడి, ప్రజ్ఞ అంతరంగమున సమాన ప్రాణముతో కూడి యుండును.
11. సమాన ప్రాణ స్పందనతో కూడియున్న మనస్సు స్పందన ననుసరించుచు, సూక్ష్మ స్పందనమును చేరి హృదయకర్ణిక కాధారమైన యొక ఊర్ధ్వమగు వెలుగు నాళము చేరును. అచటగల ఉదాన ప్రాణ స్పందనముతో ప్రజ్ఞ కూడును.
12. ఉదాన ప్రాణ స్పందనము నాళమున ఊర్ద్యముగ స్పందించుచు, ప్రజ్ఞను ఊర్ధ్యముఖముగ గొనిపోవును. ఇట్టి సమయమున బుద్ధిలోకమందలి ధ్యానమంతయు క్రమముగ సాధకునకు ఆవిష్కరింప బడుట, అవగతమగుట జరుగు చుండును. ఉదాన స్పందనము ప్రజ్ఞను ఊర్ధ్వముగ గొనిపోవుచు విశుద్ధిని దాటి ముఖమున చేరి అటు పైన నాసికాంతర ద్వారమున భ్రూమధ్యమును చేరును.
ఉదాన ప్రాణమునకు భ్రూమధ్యము శిఖర స్థానము. ప్రజ్ఞను అచ్చటికి చేర్చి నీలాకాశమును దర్శించుచు నుండుట ధ్యానస్థితిగ తెలుపుదురు. ఉదాన స్పందన మాధారముగ, హృదయము నుండి విశుద్ధి మీదుగ, భ్రూమధ్యమును చేరుట 'ప్రత్యాహార' మని, భ్రూమధ్యమున స్థిరముగ ఉదాన స్పందన శిఖరమున నుండుట 'ధారణ' యని, అట నుండి నీలాకాశమును గూర్చి ధ్యానించుట 'ధ్యాన' మని తెలియవలెను.
యోగబలముచేత ప్రాణమును సమన్వయించి, భ్రూమధ్య మును చేరుమను ఈ వాక్యమందు భగవానుడు సమస్త యోగమును నిర్దేశించినాడు. పరమును చేరు మార్గమును సున్నితముగ తెలిపి నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jul 2021
No comments:
Post a Comment