శ్రీ శివ మహా పురాణము - 425


🌹 . శ్రీ శివ మహా పురాణము - 425🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 25

🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 2 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

కరుణా సముద్రుడగు శివుడు మహర్షుల ఈ విన్నపమును విని, వికసించిన పద్మముల వంటి నేత్రములు గలవాడై ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను (12).

మహేశ్వరుడిట్లు పలికెను-

ఓ సప్తర్షులారా! కుమారులారా! నా మాటను వెంటనే వినుడు. సర్వజ్ఞులగు మీరు మాకు హితమును చేయువారు (13). దేవ దేవి యగు పార్వతి ఈ సమయములో గౌరీ శిఖరమును పేరుగల పర్వతమునందు దృఢచిత్తయై తపము నాచరించుచున్నది(14).ఓ ద్విజులారా ! అమె నన్ను భర్తగా పొందవలెననే అంతిమ నిశ్చయమును చేసుకొని ఇతర కామనలనన్నిటినీ వీడినది. అమెను సఖురాండ్రు కనిపెట్టియున్నారు (15). ఓ మహర్షులారా! మీరు నా అజ్ఞచే అచటకు వెళ్లి, ప్రేమతో నిండిన మనస్సు గలవారై, ఆమె మనస్సు ఎంత దృఢమైనది? అను విషయమును పరీక్షించుడు (16). మీరు పూర్తి అసత్యములను, నిందవాక్యములను పలుకుడు, దృఢమగు వ్రతము గల ఓ ఋషులారా! మీరు నా శాసనముచే ఈ విషయములో ఎట్టి సంశయమునైననూ పొందకుడు (17).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు ఆజ్ఞాపింపబడిన ఆ మునులు శీఘ్రమే అచటకు వెళ్లరి. అచట జగన్మాతయగు పార్వతి గొప్ప తేజస్సుతో విరాజిల్లు చుండెను (18). మూర్తీభవించిన తపస్సిద్ధివలె నున్న, పరమతేజస్సుతో విలసిల్లు చున్న పార్వతిని వారచట చూచిరి (19).దృఢవ్రతులగు ఆ సప్తర్షులు ఆమెకు మనస్సులో నమస్కరించి, ఆమెచే ప్రత్యేకముగా పూజింపబడినవారై, వినయముతో నిట్లు పలికిరి (20).

ఋషులిట్లు పలికిరి-

ఓ పార్వతీ దేవీ! వినుము, నీవు దేని కొరకు తపస్సును చేయుచున్నావు? ఏ దేవతను కోరుచున్నావు? ఏ ఫలమును కోరుచున్నావు? ఇపుడా విషయమును చెప్పుము. (21)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Jul 2021

No comments:

Post a Comment