నిర్మల ధ్యానాలు - ఓషో - 52
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 52 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ధ్యానమంటే ఒక ఆలోచనారహిత నిశ్శబ్దస్థితి. ఏదీ ఆందోళన కలిగించని ఆ నిశ్శబ్ద స్థితి, ఏదీ ఆటంకపరచని ఆ నిర్మల స్థితి అనంత అస్తిత్వాన్ని అనుభూతి చెందుతుంది. అనంత విశ్వానికది అవగతమవుతుంది. 🍀
ధ్యానం లేని ప్రార్థన సరయింది కాదు. ఎందుకంటే అది నమ్మకాల మీద ఆధార పడిన ప్రార్ధన. నీకు తెలియని దేవుణ్ణి నువ్వు నమ్మాలి. నీకు తెలియని దేవుణ్ణి నువ్వెట్లా నమ్ముతావు. నువ్వు యితర్లని మోసగిస్తావు. నిన్ను నువ్వు మోసగించు కుంటావు. ప్రార్థన అన్నది నమ్మకానికి ఆధారంగా వుండ కూడదు. అది ప్రాథమికంగా నిజాయితీ లేనిది. ప్రార్థనే నిజాయితీ లేనిదయితే యిక జీవితంలో నిజాయితీ ఎక్కడుంటుంది?
ప్రపంచంలో లక్షల మంది జనాలు ధ్యానమంటే ఏమిటో తెలీకుండా ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ప్లాస్టిక్ పూలు పట్టుకుని అవి నిజమైన పూలు అనుకుంటున్నారు. జీవితమంతా ప్రార్థిస్తూనే వుంటారు. కానీ నిజమైన ప్రార్థనకు చెందిన పరిమళాల్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళ జీవితంలో కావలసినంత ఈర్ష్య, అసూయ, ద్వేషం, దౌర్జన్యం పుష్కలంగా వుంటాయి. నా పరిశీలనలో నిజమైన మతం ధ్యానం నించే మొదలవుతుంది.
ధ్యానమంటే ఒక ఆలోచనారహిత నిశ్శబ్దస్థితి. ఏదీ ఆందోళన కలిగించని ఆ నిశ్శబ్ద స్థితి, ఏదీ ఆటంకపరచని ఆ నిర్మల స్థితి అనంత అస్తిత్వాన్ని అనుభూతి చెందుతుంది. అనంత విశ్వానికది అవగతమవుతుంది. అక్కడ అనంత విశ్వానికి అవగతం కాకుండా వుండడం అసాధ్యం. అది నమ్మకానికి సంబంధించిన సమస్య కాదు. నీకు పరవశం అనుభవ మవుతుంది. నిశ్శబ్దం అనుభవమవుతుంది. దాని సంగీతాన్ని వింటావు. ఆ సంగీతంతో నీ హృదయం ప్రార్థనతో నిండిపోతుంది. నువ్వు అస్తిత్వానికి వినమ్రుడవుతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
31 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment