గీతోపనిషత్తు -254
🌹. గీతోపనిషత్తు -254 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 2-1
🍀 2-1. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀
రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2
తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది.
వివరణము : లోకమున అనేకానేకమగు విద్యలున్నవి. అట్టి విద్యలెన్ని నేర్చినను అట్టివారు సత్యవంతునితో సరిపోలరు. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. వశిష్ఠ విశ్వామిత్రుల ఉపాఖ్యానమే దీనికి ఉదాహరణము. రజస్ తమో గుణముల దోషము చేత జీవులనేకానేక విద్యలు నేర్తురు. కాని వారు సత్యము తెలియకపోవుట చేత శాశ్వతులుగ నుండలేరు. వారే శాశ్వతులు కానపుడు, వారి విద్యలు కూడ వారితోనే పోవును. కనుక తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి.
అది అత్యంత పవిత్రము, ఉత్తమ విద్యలకన్న ఉత్తమము. పై తెలిపిన రాజవిద్య రాజగుహ్యమని భగవానుడు పలికి నాడు. అనగా రహస్యము లన్నిటి కన్న గూఢమగు రహస్యమని అర్థము. రహస్యమనగా మరుగుగ నుండునది. రాజుల రహస్యములు కూడ తెలియనగును. కాని ఈ రహస్యము విచిత్రమగు రహస్యము. దీనిని మరుగున నుంచ నవసరము లేదు. దీనిని బాహాటముగ తెలిపినను, మరుక్షణమే రహస్యమైపోవును. తెలుప కుండునది రహస్యము. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment