🌹 . శ్రీ శివ మహా పురాణము - 453🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 31
🌻. శివ మాయ - 2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
దేవతల ఈ మాటను విని బృహస్పతి శివుని నామమును స్మరిస్తూ చెవులను మూసుకొనెను. ఆయన వారి కోరికను అంగీకరించలేదు (12). అపుడు విశాల హృదయుడగు బృహస్పతి మహాదేవుని స్మరించి, దేవతలను అనేక పర్యాయములు నిందించి వారితో నిట్లనెను (13).
బృహస్పతి ఇట్లు పలికెను-
దేవతందరు తమ లాభమును సంపాదించుకొని, ఇతరుల కార్యమును ధ్వంసము చేయుట యందు నిమగ్నులైయున్నారు. శంకరుని నేను నిందించినచో నాకు నరకప్రాప్తి తప్పని సరియగును (14). ఓ దేవతలారా ! మీలో ఒకడు హిమవంతుని వద్దకు వెళ్లి ఆయనకు బోధించి మీ కోర్కెను నెరవేర్చుకొనుడు (15). ఆయన శివునకు భక్తితో కన్యాదానమును చేసి మోక్షమును పొందుట నిశ్చితము. కాని ప్రీతి లేకుండగా కుమార్తెను ఇచ్చినచో భారత ఖండమునందు సుఖముగ నుండగలడు (16).
మీలో ఒకరు వెళ్లి వచ్చిన తరువాత సప్తర్షులందరు వెళ్లి ఆ పర్వతునకు ఉపదేశించగలరు. దుర్గాదేవి పినాకధారియగు శివుని తక్క మరియొకనిని వివాహమాడదు (17). ఓ దేవతలారా! అట్లు గానిచో, మీరు ఇంద్రుని దోడ్కొని బ్రహ్మలోకమునకు వెళ్లుడు. మీ వృత్తాంతమును ఆయనకు చెప్పుడు. ఆయన మీ కార్యమును చక్కబెట్టగలడు (18).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ దేవతలందరు ఆ మాటను విని ఆలోచించుకొని నా సభకు విచ్చేసిరి. వారందరు అచట నున్న నాకు సాదరముగా నమస్కరించి విన్నివించరి (19). శివనిందను ప్రస్తావించే ఆ దేవతల మాటను విని వేదములను ప్రవర్తిల్ల జేసిన నేను విలపించితిని. ఓ మహర్షీ! అపుడు నేను దేవతలతోనిట్లంటిని (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
16 Sep 2021
No comments:
Post a Comment