మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 82


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 82 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సాధన- సమిష్టి జీవనము - 3 🌻


ఎవరితో అభిప్రాయభేదం వచ్చిందో, అతనితో సూటిగా కూడ్చుండి మాట్లాడుకొని పరస్పరావగాహనతో కలిసిపోవాలి. కొందరు సాధకులు సామాజిక విషయంలో మార్గదృష్టను అనిసరిస్తారు కాని, తమతమ వ్యక్తిగత విషయాలలో గాదు, తమ కుటుంబ వ్యవహారాలలో, తమ‌ పిల్లల వివాహ విద్యావిషయాదుల్లో తమదారి తమది. అయితే, అందరి యొక్క సమగ్ర శ్రేయస్సు సరియైన గురువుకు తెలుస్తుంది.

నిజమైన గురువు దృష్టి ఎల్లరి మేలు మీద ఉంటుంది. మామూలు మనుష్యులకు తమకు మంచి జరగాలని ఉంటుంది గాని, ఆ మంచి ఏమిటో ఏం చేస్తే వస్తుందో తెలియదు. ప్రస్తుత కాలంలో, సగటు మనిషి యొక్క ఆదర్శం గొప్పతనంగాని, మంచితనంగాదు.

సాధకులకు గూడ పూజాదుల్లో, సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచి ఉండవచ్చు గాని, ధనము, అధికారము, సంఘంలో గౌరవం మున్నగు గొప్పతనమునకు చెందిన అంశాలపై మోహం తొందరగా వీడదు. తమతమ అభిప్రాయాలను పరిపూర్ణంగా పరమగురువుకు సమర్పించుకొన్నవాడే వికాసపథంలో సాగుతాడు.

తనకు తాను సమాజ స్వరూపుడగు దేవునికి సమర్పణ పొందినవానికే 'అహంకారం' అనే పెంకు పగిలి ఆనంద సామ్రాజ్యంలో చోటు దొరుకుతుంది. నిజమయిన గురువు తమ మాట అనుచరులనబడే వారు పాటించకపోయినా సరే అలకపూనడు, తాను గురువు ‌అని‌ అనుకొనడు. ఇతరులపై తమ భావాలు రుద్దడు.

తల్లికున్న ప్రేమ వారికి ఉంటుంది. ఎవరితోనయినా ప్రేమగా మెలగ గలరు గురువులు. ప్రేమయే వారి ప్రాణం. వారి యందు గౌరవము అంటే వారిని అనుసరించడమే కాని, వట్టి నమస్కారాలు కాకూడదు. అయితే గురువుల దృష్టి మానవ సంబంధాల వికాసం మీదనే ఉంటుంది. మాట పట్టుదలకన్నా మానవుల నడుమ హృదయ పూర్వకములయిన సత్సంబంధాలు సాధకులకు ఆవశ్యకము.


....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

16 Sep 2021

No comments:

Post a Comment