గీతోపనిషత్తు -256


🌹. గీతోపనిషత్తు -256 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 2-3

🍀 2-3. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀


రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2

తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది.

వివరణము : జీవులు ప్రకృతి యందలి రూపము, రంగు, గుణము సత్యము వలననే ప్రకాశించు చున్నారు. కనుక సూటిగ సత్యమును చూడ వచ్చును. తనయందు, తన పరిసరముల యందు సూటిగ సత్యమును చూడవచ్చును. పై విధానముగ సత్యమును సూటిగ లోపల బయట చూడవచ్చును గనుక ఇది ప్రత్యక్ష అవగతమని భగవానుడు సెలవిచ్చినాడు.

ఇట్లు తనయందు, సమస్తమునందు సత్యమును దర్శించు వాడు సహజముగనే ధర్మము నందుండును. అధర్మము దరిచేరదు. ప్రత్యేకించి ప్రయత్నించి ధర్మము లభ్యసించ వలసిన అవసరముండదు. మరియు ఇట్టివాడు అన్ని కాలముల యందు, దేశముల యందు సుఖముగనే యుండును. ఈ నిరంతర సుఖ స్థితి నుండి అతడవస్థితి చెందడు. ఈ అనుష్ఠానము కూడ సుఖముగనే యుండును. కనుక దీని ననుష్ఠించుట ఉత్తమము.

ఇట్లు నిత్యము తన లోపల, తన వెలుపల సత్యమునే దర్శించు ప్రయత్నమున వుండు సాధకునకు ఇతర సాధనలు అనావశ్యకము. కేవలము సంప్రదాయబద్ధులై అనేకానేక సాధనలు ఆత్మసాక్షాత్కారము కొరకు మానవులు యుగముల తరబడి చేయుచు నున్నారేగాని అవి యన్నియు రాజవిద్యవలె సూటిగ నుండవు. ఆ సాధనల యందు సుళువుండదు. సుఖముకూడ ఉండదు. దీని నుపాసించుటకు వలసినది నిజమగు ధైర్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Sep 2021

No comments:

Post a Comment