శ్రీ శివ మహా పురాణము - 455

🌹 . శ్రీ శివ మహా పురాణము - 455🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 31

🌻. శివ మాయ - 4 🌻


అపుడు భక్తవల్సలుడు, మహేశ్వరుడు, మాయావతి, వికార రహితుడునగు ఆ శంభు భగవానుడు హిమవంతుని వద్దకు బయలు దేరెను (31). హిమవంతుడు సభామధ్యములో బంధువర్గముతో, స్వయముగా పార్వతితో గూడి ఆనందముగా కొలువు దీరి యుండెను (32).

ఇంతలో అచటకు సదాశివుడు ఏతెంచెను ఆయన దండమును, ఛత్రమును పట్టుకొని, దివ్యమగు వస్త్రములను, ప్రకాశించే తిలకమును ధరించు యుండెను (33). ఆయన చేతిలో స్ఫటికమాలను, మెడలో సాలగ్రామమును ధరించి, హరినామమును భక్తితో జపించుచుండెను. ఆ బ్రాహ్మణుడు సాధువేషమును ధరించి యుండెను (34).

ఆయనను చూచి హిమవంతుడు పరివారముతో సహాలేచి నిలబడెను. అపూర్వమగు ఆ అతిథికి భక్తితో సాష్టాంగ నమస్కారము నాచరించెను (35). పార్వతి బ్రాహ్మణ రూపములో నున్న ప్రాణప్రియునకు భక్తితో నమస్కరించెను. ఆ దేవి మనస్సులో ఆయనను గుర్తెరింగి పరమానందముతో స్తుతించెను (36).

బ్రాహ్మణ వేషధారియగు శివుడు వారందరిని ప్రీతి పూర్వకముగా నాశీర్వదించెను. వత్సా! ఆయన మనస్సులో పార్వతికి, తనకు నచ్చిన ఆశీస్సులను అధికముగా నిచ్చెను (37). ఆ బ్రాహ్మణుడు పర్వతరాజగు హిమవంతునిచే మహాదరముతో నీయబడిన మధుపర్కము మొదలగు అతిథిపూజను పూర్ణముగా స్వీకరించెను (38).

ఓ మునీ! పర్వతరాజగు హిమవంతుడు ఆ బ్రాహ్మణోత్తముని మహాప్రీతితో చక్కగా పూజించి కుశలమడిగెను (39). తరువాత పర్వతరాజు ఆయనను 'మీరెవరు?' అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు వెంటనే సాదరముగా పర్వతరాజుతో నిట్లనెను (40).

ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడిట్లు పలికెను -

ఓ పర్వతరాజా! నేను బ్రాహ్మణుడను, వైష్ణవుడను, మహాపండితుడను. జ్యోతిష వృత్తిని చేపట్టి భూమండలము నందు తిరుగాడు చుందును (41). నేను నాకు నచ్చిన విధముగా తిరిగెదను. అన్ని చోట్లకు వెళ్లుచుందును. గురువు యొక్క అనుగ్రహముచే నాకు సర్వము తెలియును. నేను పరోపకారమును చేయుచుందును. పరిశుద్ధమగు అంతఃకరణము గలవాడను. దయానిదిని. వికారములు లేనివాడను (42).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


21 Sep 2021

No comments:

Post a Comment