✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 4-1
🍀 4. చిదాకాశము -1 - భగవానుడి ఆధారముగనే సమస్త ప్రపంచము, జీవులు ఏర్పడియున్నారు. అవి యన్నియు తన యందే యున్నవి. అయినప్పటికిని తానట్లే చిదాకాశమై యున్నాడే కాని, వాని యందున్నానను భావము తనకు లేదు. తెరపై గోచరించుచున్న ఏ జీవియు తెరపై ప్రభావము చూపలేవు. కాని తెరపై వెలుగుచున్న సమస్త జగత్తు, భూతములు తెర ఆధారముగనే అస్థిత్వము కలిగి యున్నవి. తెరలేనిచో అవి ఏమియును లేవు. తెరకు నిజమునకు వాని అవస్థలతో పనిలేదు. తాను తానుగనే యుండును. 🍀
మయాతత మిదం పర్వం జగదవ్యక్తమూర్తినా |
మళ్లోని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4
తాత్పర్యము : ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడగు నాచే వ్యాపింపబడినది. సమస్త భూతములు నా యందే యున్నవి. వాని యందు నేను అవస్థితి చెందను. నేను నేనుగనే యుందును.
వివరణము : ఒక అద్భుతము, గంభీరము అగు సత్యము భగవానుడిచట ఆవిష్కరించుచున్నాడు. తానాధారముగనే సమస్త ప్రపంచము, జీవులు ఏర్పడియున్నారు. అవి యన్నియు తన యందే యున్నవి. అయినప్పటికిని తానట్లే చిదాకాశమై యున్నాడే కాని, వాని యందున్నానను భావము తనకు లేదు. వెండితెరపై అనేకమగు రూపములు ఏర్పడుచుండును. కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, వాయువు, అగ్ని, జలము, మట్టి కనబడుచుండును.
అట్లే ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవులు, గ్రహగోళాదులు, తారకలు తెరపై కనిపించును. అవి యన్నియు తెర ఆధారముగనే అట్లు గోచరించుచున్నవి. వెండి తెర లేనిచో గోచరింపవు. వాటన్నిటికిని వెండి తెరయే ఆధారము. కాని వెండితెరకు అవి ఏవియు ప్రభావము చూపలేవు. వెండితెరపై కొండ వెండితెరకు బరువుగ నుండదు. నీరు తడిగ నుండదు. అగ్ని తెరను మండింపదు.
అట్లే తెరపై గోచరించుచున్న ఏ జీవియు తెరపై ప్రభావము చూపలేవు. కాని తెరపై వెలుగుచున్న సమస్త జగత్తు, భూతములు తెర ఆధారముగనే అస్థిత్వము కలిగి యున్నవి. తెరలేనిచో అవి ఏమియును లేవు. తెరకు నిజమునకు వాని అవస్థలతో పనిలేదు. తాను తానుగనే యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
28 Sep 2021
No comments:
Post a Comment