శ్రీ శివ మహా పురాణము - 458


🌹 . శ్రీ శివ మహా పురాణము - 458🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 2 🌻

ఋషులిట్లు పలికిరి-

మహారాజా! దేవతాసార్వభౌమా! సర్వోత్తమమగు మా భాగ్యమును మేము ఏమని వర్ణింపగలము? (13) పూర్వము శరీరవాఙ్మనస్సులచే తపస్సును చేసితిమి. ఉత్తమమగు వేదాధ్యయనమును చేసితిమి. అగ్నిహోత్రమును చేసితిమి. వివిధ తీర్థములను సేవించితిమి (14).

శరీరవాఙ్మనస్సులచే సిన పుణ్యము, నిన్ను స్మరంచుటచే కలిగిన పుణ్యము అంతయూ జతగూడి నీవు మమ్ములను స్మరించుట అను భాగ్యము మాకీ నాడు కలిగినది (15). నిన్ను ప్రతిదినము స్మరించు మానవుడు కృతార్థుడగును. నీచే స్మరింపబడు వారియొక్క పుణ్యమును ఏమని వర్ణించదగును? (16)

ఓ సదాశివా! నీవు స్మరించుటచే మేము అందిరిలో గొప్పవారమైతిమి. నిన్ను మనస్సులో స్మరించుట యైననూ మానవులకు దుర్లభము (17). పొట్టివానికి పండు అందినట్లు, పుట్టుగుడ్డికి కళ్లు కనబడినట్లు, మూగివానికి మాటలాడుట వచ్చినట్లు, దరిద్రునకు నిధి లభించినట్లు (18), కుంటివాడు గొప్ప పర్వతమును అతిక్రమించినట్లు, గొడ్రాలికి సంతానము కలిగినట్లు, మాకు దుర్లభమగు నీ దర్శనము కలిగినది. హే ప్రభో! (19) ఈనాటి నుండి మేము లోకములో పూజింపబడెదము. గొప్ప మునులచే మాన్యతను పొందెదము. నీ దర్శనము చేత మాకు ఉన్నత పదము లభించినది (20).

ఈ విషయములలో పెక్కు మాటలేల? మాకు అన్నివిధములా మాన్యత కలిగినది. దేవతలందరికి ఈశ్వరుడవగు నీ దర్శనముచే పూజ్యత కలిగినది. ఓ దేవదేవా! (21) పూర్ణులకు కర్తవ్యమేమి ఉండును? నీకు దయ ఉన్నచో సేవకులకు ఈయదగిన శుభకార్యమును మాకు అప్పజెప్పుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడగు శంభుడు వారి ఈ మాటలను విని లోకాచారము ననుసరిస్తూ అందమగు వాక్యము నిట్లు పలికెను (23).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Sep 2021

No comments:

Post a Comment