మైత్రేయ మహర్షి బోధనలు - 3
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 3 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 2. సాధన సోపానము-1 🌻
ఏ సన్నివేశము నందుగాని, సంఘటన మందుగాని, అకస్మాత్తుగా జరుగు సంఘటనల యందు గాని చెదరకుండుట అభ్యసింపుము. దీనివలన ఎంతయూ ప్రయోజనము కలుగును. నిశ్చలమైన మనస్సును ఏర్పరచుకొనుటకు అనేక రకములగు అభ్యాసములు గలవు. దైవము యొక్క స్మరణము భావరూపమున గాని, మంత్రరూపమునగాని నిరంతరము చేయుట ఒక ఉపాయము.
తనయందు, తన పరిసరముల యందు సతతము సాన్నిధ్యము నిచ్చుచున్న అంతర్యామిని ఎరిగియుండుట మరియొక యుపాయము. అనగా అన్యచింతన లేక అనన్యచింతన యందు నిలబడుట, దీనినే భగవానుడు పర్యుపాసనము అని తెలిపినాడు. ఈ ఉపాసనము దేశము, కాలము, నామము, రూపము అను పరిమితులు దాటి జరుగుచుండవలెను.
దైవమును ఒక నామము నందో, ఒక రూపము నందో, ఒక కాలమునందో లేక ఒక దేశము నందో స్మరించుట ప్రాథమికమగు అభ్యాసము. అభ్యాసము ముందుకు సాగిన సందర్భమున అన్ని రూపముల యందు, అన్ని నామముల యందు, అన్ని దేశములయందు, అన్ని కాలముల యందు భగవంతుని సాన్నిధ్యమును పొందు ప్రయత్నము జరుగును. అంతర్యామిని అంతట దర్శించుట చేయు ప్రయత్నము సత్యమైన సాధన. ఈ సాధన ద్వారా అస్థిరస్థితి నుంచి మనస్సు స్థిరస్థితిని చేరుకొనగలదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
10 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment