మైత్రేయ మహర్షి బోధనలు - 4
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 4 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 2. సాధన సోపానము-2 🌻
స్థిరమైన చిత్తము అకస్మాత్తు సన్నివేశములకు అదిరిపడదు. “ఎప్పుడైనను, ఎవరికైనను, ఎక్కడైనను, ఏదైనను జరుగ వచ్చును.” ఈ వాక్యమును గుర్తు ఎరిగియుండుట తెలివి. అంతర్యామి దర్శనము సాధన చేయుచు ఈ మహావాక్యముల యందలి సత్యమును అంగీకరించి జీవించి యుండుట వలన ఆశ్చర్యపడుట, అదిరిపడుట అనునవి లేక జీవించు స్థిరచిత్తము క్రమశః అలవడగలదు. అట్లు అలవడినచో నీకు ముందు చూపు కలుగగలదు. ఉన్నత స్థితియందు యిదియే కాలజ్ఞానముగ సిద్ధించును. స్థిరచిత్తునకు అదృశ్యము దృశ్యమగును. అప్రమత్తత స్థిరచిత్తుని యొక్క మరియొక ముఖ్య లక్షణము.
ప్రస్తుత కాలమున ఎన్నియో అలజడులు కలుగుచున్నవి. ఇట్టి అలజడులయందు తలమునకలు కాక స్థిరముగ నిలబడుట లోక హితుని కర్తవ్యము. అప్రమత్తత, స్థిరచిత్తత తన సహజ గుణములై నటువంటి లోకహితునకు కాలమును, దేశమును బట్టి దివ్య ప్రణాళికకు సంబంధిత మగు సందేశములందుచుండును.
అవసరమును బట్టి గురుపరంపర యొక్క సాన్నిధ్యము కూడ లభించు చుండును. ప్రపంచపు అలజడితో సంబంధములేక అతడొనర్చు కార్యములు సిద్ధించుచుండును. అట్టి లోకహితులకు అప్రమత్తులమై మేము (మా గురుపరంపర) మా సహాయ సహకారము లందించ గలము. కావున స్థిరచిత్తుడవై ప్రశాంత మనస్కుడవై, అప్రమత్తుడవై, కార్యోన్ముఖుడవై, అంతర్యామి సాధన యందు జీవితమును నిలుపుము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
16 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment