మైత్రేయ మహర్షి బోధనలు - 5


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 5 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 3. మిత్రత్వము 🌻


మేము మన్నించు అత్యుతమైనటువంటి సద్గుణము మిత్రత్వము. మిత్రుడు కలవాడు సంపన్నుడు. తన తోటివారితో మిత్రత్వము సాధించుట సాధకుని స్థితిని తెలియజేయ కలదు. సంఘము మిత్ర సంఘమైనచో మా ఆశయము నెరవేరగలదు. ఎదుటపడినప్పుడు స్తుతించుట, ఇతర సమయములలో నిందించుట సాధకుని అపరిపక్వ స్థితిని ప్రస్ఫుటముగా తెలియ జేయును. ఉత్తమసాధకులము అనుకొను చున్న వారెందరో ఇట్టి అవస్థితికి లోనగుచున్నారు. త్రికరణ శుద్ధి లేనిచోట దైవమెట్లుండగలడు? ముందొక మాట, వెనుక ఒక మాట సత్సాధనను అపహాస్యము చేయుటయే కదా! ఏ ఇద్దరి మధ్య పరిపూర్ణ మైత్రికలదో అచ్చట ప్రేమ ప్రవహించగలదు. ముగ్గురు వ్యక్తులు వారి మధ్య ఎట్టి అరమరికలు లేక వున్నచో అట్టి త్రిభుజము నాధారము చేసికొని, మేము మహాత్కార్యములను సాధింపగలము.

కలియుగ ప్రభావమో ఏమో మానవుడు ఈ మాత్రపు సంస్కారమును కలిగి ఉండుట లేదు. మిత్రత్వము సాధకునికి తన జీవన ప్రయాణమున వేగమును కల్పింపగలదు. ఒకరికొకరు సహకరించుకొనుచు ముందుకు సాగినచో ప్రయాణమున అలసటయుండదు. హృదయమున కలిసి పనిచేయుటలో మహత్కార్యములు సిద్ధించగలవు. భూమి యందలి సారమును తీసుకొనుటకు విత్తనము నందు తేమ యుండవలెను, అది కారణముగ విత్తనము మహావృక్షమై విలసిల్లగలదు. అటులనే ఒక సాధకుని లోకహితకార్యము వటవృక్షమై విలసిల్లుటకు మిత్రత్వము తేమవలె పనిచేయగలదు. ఇది కారణముగనే, మా నామము, మిత్రత్వమునకు మరియొక పేరు. మిత్రత్వము లేనివారు ఏమియును సాధింపలేదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


15 Sep 2021

No comments:

Post a Comment