మైత్రేయ మహర్షి బోధనలు - 7


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 7 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 5. ఆశయము 🌻


ఉత్తమమైన ఒక గమ్యమును ఏర్పరచుకొని, దానికై కృషి చేయుచు కృషిలో భాగముగ తనను, తనవనరులను సమర్పణ చేయుచు గమ్యమును చేరుట సాధనయందు ముఖ్యమైన అంశము. తమదైన సేవ జాతికి ఈవిధముగ సమర్పించుట వలన సాధకుడు తప్పక పరిణితి చెందును. ఏమహాత్ముని జీవితమును గమనించినను ఈ అంశము ప్రస్ఫుటముగ గోచరించును. బుద్ధుడు అహింసా భావమును ప్రతిష్ఠితము చేసెను. ఆదిశంకరులు జ్ఞానమును పునః ప్రతిష్ఠితము చేసిరి. రామానుజులు భక్తిభావమును ప్రతిష్ఠితము చేసిరి. కొందరు యోగమును, మరికొందరు జీవుల సేవయు, మరి కొందరు దీనజనోద్ధరణము.

ఇంకొందరు మనోవికాసము కలిగించుట. ఇట్లు రకరకములుగ ఉత్తమమైన ప్రణాళికలను నిర్వర్తింప చేసిరి. మహాత్ముల మార్గమున స్ఫూర్తినొందిన సత్సాధకుడు తనదైన సేవా కార్యక్రమమును ఒకటి సంకల్పించి నిర్వర్తించుచు ఉన్నత పరిణామ ములను జీవుల కేర్పరచుటకు కృషి చేయవలెను. కేవలము తన ముక్తి కొరకు సాధన చేయువారు గమ్యమును చేరలేరు. తమకు ముక్తి అనునది స్వార్థమే కదా! స్వార్థము,ముక్తి ఒకే కాలమున ఎట్లు సిద్దించగలవు? జీవుల సేవ కారణమున ఏర్పడు నిస్వార్థత, ముక్తికి హేతువగును. తనదగు సేవా ప్రణాళికను నిర్వర్తించు సందర్భమున తాను మొదట ఏకాకిగ నుండును.

తాను నిర్వర్తించు కార్యమునందలి పవిత్రతను బట్టి సజ్జనులు చేరుట, ఒక బృందముగ నేర్పడుట కూడ జరుగును. సమిష్టిగ, సహకార బుద్ధితో కార్యములను నిర్వర్తించుట వలన ప్రణాళిక సిద్ధించును. మార్గమున నిస్పృహ, సందేహము, భయము, స్వార్థము అను నలుగురు దుండగులు దారికాచి దోచుకొన గలరు. సాధకుడు అప్రమత్తుడై ఈ నలుగురు దుండగులు బారిని పడకుండ ఉత్సాహముతో ముందుకు సాగవలెను. ఇట్టి నిర్మాణాత్మక మైన సేవాప్రణాళిక కనీసము 12 సంవత్సరములు నిర్వర్తించుచూ అందు సహకరించు అనుయాయులకు సంపూర్ణముగ అందించి తాను కృతకృత్యుడు కాగలడు. ఇది మమ్ములను మిక్కిలిగ ఆకర్షించు అంశము. మా సాన్నిధ్యము, సహకారము లభించుటకు మార్గము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


20 Sep 2021

No comments:

Post a Comment