గీతోపనిషత్తు -260
🌹. గీతోపనిషత్తు -260 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 4-2
🍀 4. చిదాకాశము -2 - మన యందు ఈశ్వరుడు లేనిచో మనము లేము. అతడాధారముగనే మనయందు సమస్త వ్యాపారము జరుగుచున్నది. జాగ్రదవస్థ, నిద్రావస్థ, స్వప్న అవస్థ మనకున్నవి గాని, మన యందలి ఈశ్వరునకు లేవు. ఈశ్వరుడు సర్వత్ర ఈశ్వరుడుగనే యుండును. జీవుల అవస్థలు ఈశ్వరునిపై ప్రభావము చూపవు. మనము తురీయ అవస్థ పొందగలిగినచో ఈశ్వరుని అనవస్థిత్వము తెలియును. మన యందలి ఈశ్వరుడు ఎప్పుడును ఈశ్వరుడుగనే యున్నాడు.🍀
మయాతత మిదం పర్వం జగదవ్యక్తమూర్తినా |
మళ్లోని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4
తాత్పర్యము : ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడగు నాచే వ్యాపింపబడినది. సమస్త భూతములు నా యందే యున్నవి. వాని యందు నేను అవస్థితి చెందను. నేను నేనుగనే యుందును.
వివరణము : భగవానుడు తెర వెలిగి యున్నపుడు చిదాకాశమై యుండును. అపుడే బొమ్మల కథ (సృష్టి కథ). తెర వెలుగకున్నచో పరాకాశమై యుండును. అపుడే కథయు లేదు. తానే యుండును. నాకవస్థితి లేదు అని భగవానుడు పలుకుటలో తానెప్పుడును, ఎట్టి మార్పు చెందని వాడని తెలియ జేయుచున్నాడు. మార్పును చెందునవి జీవులు, సృష్టి మాత్రమే.
మరియొక ఉదాహరణము : బంగారముతో ఉంగరము చేయించినపుడు, ఉంగరముగ గోచరించునది బంగారమే. బంగారము లేనిదే ఉంగరము లేదు. ఉంగరమందు కూడ బంగారము బంగారముగనే యుండును గాని ఉంగరభావము బంగారమున కుండదు. మరియొక ఉదాహరణము : సముద్రమున అలలు గోచరించును. అలల యందున్నది సముద్రమే. సముద్రము అల యందు కూడ సముద్రముగనే యుండును. అవస్థితి అలకేగాని సముద్రమునకు గాదు.
మరియొక ఉదాహరణము : మన యందలి ఈశ్వరుడు ఎప్పుడును ఈశ్వరుడుగనే యున్నాడు. అతడాధారముగ మన మనేకమగు వర్తనములు సలుపుచున్నాము. మన యందు ఈశ్వరుడు లేనిచో మనము లేము. అతడాధారముగనే మనయందు సమస్త వ్యాపారము జరుగుచున్నది. జాగ్రదవస్థ, నిద్రావస్థ, స్వప్న అవస్థ మనకున్నవి గాని, మన యందలి ఈశ్వరునకు లేవు. ఈశ్వరుడు సర్వత్ర ఈశ్వరుడుగనే యుండును. జీవుల అవస్థలు ఈశ్వరునిపై ప్రభావము చూపవు. మనము తురీయ అవస్థ పొందగలిగినచో ఈశ్వరుని అనవస్థిత్వము తెలియును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment