శ్రీ శివ మహా పురాణము - 459


🌹 . శ్రీ శివ మహా పురాణము - 459🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 3 🌻

శివుడిట్లు పలికెను-

ఋషులు సర్వదా పూజనీయులు. మీరు మరిం పూజనీయులు. ఓ విప్రులారా! నేను ఒక కారణముచే మిమ్ములను స్మరించితిని (24). నేను లోకములకు సిద్ధిని కలిగించి ఉపకారమును చేయుటకు నడుము కట్టి యుందునని మీరెంగుదురు (25). దుర్మార్గుడగు తారకుని వలన దేవతలకు దుఃఖము సంప్రాప్తమైనది. బ్రహ్మ అతిక్లిష్టమగు వరము నిచ్చినాడు. నేనేమి చేయుదును? (26) ఓ మహర్షులారా! నా ఎనిమిది మూర్తులు లోక ప్రసిద్ధుములై యున్నవి. అవి లోకముల ఉపకారము కొరకే గాని, నా స్వార్థము కొరకు గాదని స్పష్టమే (27).

ఆ కారణముగనే నేను శివాదేవిని వివాహమాడ గోరితిని. ఆమె మహర్షులు కూడ చేయరాని గొప్ప తపస్సును చేసినది (28). ఆమెకు అభీష్టము, హితకరము అగు పరమఫలము నీయవలసి యుండెను. భక్తులకు ఆనందమును కలిగించుట నా ప్రతిజ్ఞయని స్పష్టమే గదా! (29) పార్వతియొక్క మాటను అనుసరించి నేను భిక్షరూపముతో హిమవంతుని గృహమునకు వెళ్లితిని. లీలా పండితుడనగు నేను ఆ కాళి మాటను నిలబెట్టితిని (30). ఆ దంతపులు నన్ను పరబ్రహ్మయని గుర్తించి పరమభక్తితో తమ కుమార్తెను వేదోక్త విధిగా నాకీయ గోరిరి (31).

నేను దేవతల ప్రేరణచే శివనిందను చేసితిని. వారి భక్తిని చెడగొట్టుటకై నేను వైష్ణవ రూపమును ధరించి అట్లు చేసితిని (32). వారా నిందను విని మిక్కిలి నిర్వేదమును పొంది భక్తిని గోల్పోయిరి. ఇపుడు వారు నాకు తమ కన్యను ఈయనిచ్చగించుటలేదు. ఓ మునులారా! (33) కావున మీరు హిమవంతుని గృహమునకు వెళ్లి ఆ పర్వతరాజునకు, ఆయన భార్యకు హితము నుపదేశించుడు (34). వారికి వేదతుల్యమగు ఉపదేశమును ప్రయత్నపూర్వకముగా చేయుడు. ఈ ఉత్తమ కార్యము తప్పక సఫలమగునట్లు చేయుడు (35).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Oct 2021

No comments:

Post a Comment