మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 100 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భాగవత రహస్యము - 2 🌻


ఎందరు వ్యక్తులున్నారో అన్ని విధములైన ఆదర్శములు వర్తించుచున్న ఈ మహాసముద్రమున ఎవని ఆదర్శము స్వతంత్ర సంచలనము పుట్టింపగలదు? వ్యక్తులలో ఆదర్శములున్నను వ్యక్తులు స్వభావ మహాసముద్రమున మునకలు వేయుచున్నారు.

ఈ రహస్యమునే నారదుడు వ్యాసునకు భాగవత రహస్యముగా బోధించెను. "కొండచిలువచే మ్రింగబడుచున్న ఇద్దరిలో ఒకరినొకరు వెలుపలకు లాగి రక్షింపలేరు" అని నారదుడు హెచ్చరిక చేసెను.

వ్యాసాదులు ఆరాధించినది సృష్టి మహాసముద్రము. అదియే జీవులలోన అంతర్యామియైన నారాయణుడు. అందు అందరును వర్తించుచున్నారు. వానికి అందరును వశులే.

ఈ అంతర్యామితత్త్వము మానవుని బహిరంతర్లోకములలో వ్యాపించియున్నది. దానిని ఆరాధించుచు వ్యాసాదులు రచనలు సాగించిరే గాని, పండితులు, విమర్శకుల, సంఘ సంస్కర్తల మొగములు చూచికాదు.

అట్టి రచనలకు పరిణత స్వరూపమై పరమావధియైన చరమావధిగా రూపుకట్టుకున్నది శ్రీమద్భాగవతము. అది ఈ సృష్టి రూపమున ఉన్న అంతర్యామికి సమర్పితము.

శాశ్వత కాలమునందు వచ్చుచు పోవుచున్న మానవుల మొత్తము స్వభావమైన మానవుడు భాగవతమునకు కథానాయకుడు. అతడు సృష్టి ఆది నుండి నేటి వరకును ఏయే లోకముల దారులలో దిగివచ్చెనో ఆ మొత్తము వైఖరిని అద్దము పట్టిచూపునది భాగవతము.

నారాయణుడు, చతుర్ముఖుడు, స్వాయంభువ మనవు, ఆది వరాహమూర్తి, కపిలాచార్యుడు, విష్ణువు, శివుడు, అంబిక, ధ్రువుడు, పృథు చక్రవర్తి, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అను పాత్రలలో ఇందలి కథానాయకుడు సకల మానవధర్మ సంస్థాపనామూర్తియై రూపుకట్టెను. ఇన్నిటిని శ్రద్ధగా చదువుకున్నచో సృష్టి మొదలు నేటివరకును గల పురుషుడెవ్వడో, అతని శాశ్వత ధర్మస్వరూపమెట్టిదో విశదపడును.

ఈ కథలన్నియు ఒకే నారాయణుని వివిధ ధర్మ గుణముల వివరణములే గాని, వేర్వేరు కథలు కావు. ఇందలి పురుషార్థములను భక్తితో అధ్యయనము చేసినచో మానవునకు తెలియవలసినవి అన్నియు తెలియును.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


07 Nov 2021

No comments:

Post a Comment