గీతోపనిషత్తు -272


🌹. గీతోపనిషత్తు -272 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 11-2

🍀 11-2. దైవానుగ్రహము - అన్నివేళల యందును వ్యాపించి, శాశ్వతముగ వసించియున్న వానిని ఎందైనను చూడవచ్చును. ఎప్పుడైనను చూడవచ్చును. ఎక్కడైనను చూడవచ్చును. చూడలేకపోవుట గ్రుడ్డితనమే! మూఢత్వమే! అందుకని, మూఢుడగుట చేతనే తనను చూడలేరని, తాను భూతమహేశ్వరుడైనను కూడ చూడలేకున్నారని తెలిపినాడు. తానే స్వయముగ శరీరము ధరించి జీవులలో తిరుగుచున్నను చూడలేకపోవుట ఎంత దురదృష్టము! ఇది జీవుల దుస్థితి. కన్ను లెదుట నున్నది వైకుంఠమే అని తెలిసినను మరచుట నిర్లక్ష్యమే కదా! 🍀


అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |
పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11

తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.

వివరణము : ఇట్లంతటను అన్నివేళల యందును వ్యాపించి, శాశ్వతముగ వసించియున్న వానిని ఎందైనను చూడవచ్చును. ఎప్పుడైనను చూడవచ్చును. ఎక్కడైనను చూడవచ్చును. చూడలేకపోవుట గ్రుడ్డితనమే! మూఢత్వమే! అందుకని, మూఢుడగుట చేతనే తనను చూడలేరని, తాను భూతమహేశ్వరుడైనను కూడ చూడలేకున్నారని తెలిపినాడు.

అంతేగాక, తానే స్వయముగ శరీరము ధరించి జీవులలో తిరుగుచున్నను చూడలేకపోవుట ఎంత దురదృష్టము! ఇది జీవుల దుస్థితి. కన్ను లెదుట నున్నది వైకుంఠమే అని తెలిసినను మరచుట నిర్లక్ష్యమే కదా! ఎక్కడో దేవుడున్నాడని వెదుకులాడు వారందరు మూర్ఖ్యులే కదా! తమ యందు, తమ పరిసరముల యందు ఈశ్వరుడే నిండియున్నను చూడలేరు.

స్వయముగ తాను ఏ రూపము ధరించినను చూడలేరు. చూడలేని వారు మరికొందరు చూడలేని వారిని ఆశ్రయించి, స్పష్టముగ నున్న వస్తువును చూడ లేకుండుట వింతలన్నిటిలోనికి పతాకస్థాయి చేరిన వింత. పరమాత్మ తానే స్వయముగ రూపుగట్టుకొని శ్రీకృష్ణుడుగ షోడశ కళలతో భూమి పై క్రీడార్ధముగ చరించినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


07 Nov 2021

No comments:

Post a Comment