శ్రీ శివ మహా పురాణము - 471


🌹 . శ్రీ శివ మహా పురాణము - 471 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 34

🌻. అనరణ్యుడు - 3 🌻


ఇంతలో ప్రాజ్ఞుడు, గొప్ప బ్రాహ్మణుడు అగు గురువు, బుద్ధిమంతుడగు పురోహితుడు రాజ సన్నిధికి విచ్చేసిరి (23). రాజు వారిద్దరికీ నమస్కరించి పూజించి వారి యెదుట భోరుమనెను. వారు ప్రశ్నించగా ఆతడు ఉచితరీతిని వృత్తాంతమునంతనూ నివేదించెను (24). అపుడు వేదవేత్తయగు గురువు, పండితుడగు పురోహితుడు కలిసి నీతి శాస్త్రజ్ఞులు గనుక, రాజునకు ఇట్లు బోధించిరి (25). శోకముచే వ్యాకులమైన మనస్సుగల రాజపత్నులకు, రాజకుమారులకు, రాజకన్యకు వారిద్దరు అందరికీ హితమును కలిగించే ఉత్తమనీతిని సాదరముగా విన్నవించిరి (26).

గురువు, రాజ పురోహితుడు ఇట్లు పలికిరి-

మహాప్రాజ్ఞా! రాజా! మంచి మితమును కలిగించు మా ఇద్దరి మాటను వినుము. బంధువర్గముతో గూడి దుఃఖించకుము. శాస్త్రమునందు సద్బుద్ధిని కలిగియుండుము (27). రాజా! ఈనాడుగాని, సంవత్సరము తరువాత గాని అమ్మాయిని యోగ్యుడగు బ్రాహ్మణునకు గాని, లేదా ఎవరికో ఒకనికి గాని ఈయవలసినదే గదా! (28) ముల్లోకములలో బ్రాహ్మణునికంటె యోగ్యమగు పాత్ర మాకు గానరాలేదు. కావున కుమార్తెను మహర్షికి ఇచ్చి నీ సంపదలన్నిటినీ రక్షించు కొనుము (29). రాజా ! ఒక్కరి కొరకై సర్వము నశించే సందర్భములో వానిని విడిచి సర్వమును రక్షించవలెను. ఈ నీతి శరణాగతుని విషయములో వర్తించదు (30).

వసిష్ఠుడిట్లు పలికెను-

రాజు ఆ బుద్ధిమంతుల మాటలను విని అనేక పర్యాయములు రోదించి, కన్యను అలంకరించి, ఆ మహర్షికి అప్పజెప్పెను. (31). ఓ శైలరాజా! ఆ ముని కన్యను స్వీకరించెను. ఆతడు అక్ష్మివంటి ఆ పద్మను ఆనందముతో పరిణయమాడి యథావిధిగా తన గృహమునకు దోడ్కొని వెళ్లెను (32). రాజు వృద్ధునకు కుమార్తె నిచ్చుటచే అందరినీ వీడి మనస్సులో దుఃఖము గలవాడై తపస్సు కొరకు అడవికి పోయెను (33). ఆయన భార్య తన ప్రాణనాథుడు అడవికి పోగానే భర్తయొక్క వియోగము, కుమార్తె యొక్క దుఃఖమును సహింపలేకపోయెను. ఓ పర్వతరాజా! ఆసుందరి ప్రాణములను విడిచి పెట్టెను (34).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


07 Nov 2021

No comments:

Post a Comment