గీతోపనిషత్తు -271


🌹. గీతోపనిషత్తు -271 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 11-1

🍀 11-1. దైవానుగ్రహము - పరమాత్మ మహతత్త్వమునకు కూడ పరుడు, ఈశ్వరుడు. తన నుండియే సంకల్పము, కాలము, ప్రకృతి ఉద్భవించి చోటుగ ఏర్పడినది. అట్టి చోటునే మహత్తందురు. అట్టి మహత్తుకు కూడ ఈశ్వరుడు అగుటచే అతనిని మహేశ్వరు డనిరి. తాను లేని చోటులేదు. తాను లేని కాలము లేదు. తానులేని రూపము లేదు. అణువు నుండి బ్రహ్మాండము వరకు అన్నిటి యందు తానున్నాడు. నిజమునకు అన్నియు తనలో పుట్టి, తనలో పెరిగి, తనలో వర్తించుచు, తన లోనికే లయమగు చుండును. ఇది పరమాత్మయొక్క భూత మహేశ్వర స్థితి. 🍀

అవజావంతి మాం మూఢా మానుషీం తమమాశ్రితమ్ |
పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11

తాత్పర్యము : సమస్త భూతములకు ఈశ్వరుడగు నన్ను మూఢులు తెలియలేకున్నారు. శరీరము ధరించి యున్నను కూడ నన్ను తెలియలేక అలక్ష్యము చేయుచున్నారు.

వివరణము : పరమాత్మ మహతత్త్వమునకు కూడ పరుడు, ఈశ్వరుడు. తన నుండియే సంకల్పము, కాలము, ప్రకృతి ఉద్భవించి చోటుగ ఏర్పడినది. అట్టి చోటునే మహత్తందురు. అట్టి మహత్తుకు కూడ ఈశ్వరుడు అగుటచే అతనిని మహేశ్వరు డనిరి. మహత్తు నుండియే మహదహంకారము పుట్టినది. అందుండియే మూడు విధములగు అహంకారములు, పంచభూతములు, పంచ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు పుట్టినవి. అవి ఆధారముగ భూతములు పుట్టినవి. అనగా సృష్టి మండలములు, వాని యందు జీవులు ఏర్పడినారు.

అన్నిటి యందు తానే బలముగ నున్నాడు. తాను లేని చోటులేదు. తాను లేని కాలము లేదు. తానులేని రూపము లేదు. అణువు నుండి బ్రహ్మాండము వరకు అన్నిటి యందు తానున్నాడు. నిజమునకు అన్నియు తనలో పుట్టి, తనలో పెరిగి, తనలో వర్తించుచు, తన లోనికే లయమగు చుండును. ఇది పరమాత్మయొక్క భూత మహేశ్వర స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

05 Nov 2021

No comments:

Post a Comment