గీతోపనిషత్తు -274
🌹. గీతోపనిషత్తు -274 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 12
🍀 12-1. కర్తవ్య కర్మ - మానవుని పట్టి బంధించు మూడు రకముల వికారములు - మొదటిది మోహిని. రెండవది కామిని. మూడవది ఆసురి. వీని వలన మోహము చెందుట, ఆశపడుట, అవివేకముతో ప్రవర్తించుట జరుగుచుండును. మోహము వలన కర్తవ్యములు మరచి, కోరిక నాశ్రయించుట జరుగును. తన కోరికలే తన కర్తవ్యములుగ పొరపడి, కోరికలను తీర్చుకొను మార్గమున పతనము ప్రారంభమగును. కర్తవ్యము వదలిన వానిని కోరిక ఆశ్రయించి, మోహము కలిగించి పతనపు దారిన అధోగతికి చేర్చును. ఎట్టివాడైనను ఈ కురుక్షేత్రమందు కర్తవ్యము నాశ్రయించియే చరించవలెను. 🍀
మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12
తాత్పర్యము : మోహముచేతను, ఆశచేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.
వివరణము : మానవుని పట్టి బంధించు మూడు రకముల వికారములను భగవానుడీ శ్లోకమున తెలుపుచున్నాడు. అందు మొదటిది మోహిని. రెండవది కామిని. మూడవది ఆసురి. వీని వలన మోహము చెందుట, ఆశపడుట, అవివేకముతో ప్రవర్తించుట జరుగుచుండును. మోహము వలన కర్తవ్యములు మరచి, కోరిక నాశ్రయించుట జరుగును. తన కోరికలే తన కర్తవ్యములుగ పొరపడి, కోరికలను తీర్చుకొను మార్గమున పతనము ప్రారంభమగును. కోరికకు ఆశ అనునది కవల పిల్లవలె ఉండును. ఆశ వలన మోహము బల పడును. జ్ఞానము నశించును. ఏ విధముగనైన తన కోరిక నెర వేరుటయే ప్రధానమని భావించి, జ్ఞానవిహీనమగు కార్యములు ఆచరించును.
క్రమముగ ధర్మాధర్మములను త్యజించి అసుర బుద్ధితో కోరికలు తీర్చుకొను మార్గము పట్టును. ఆ మార్గమున రాక్షస ప్రవృత్తిని పొందును. అట్టి సమయమున ఎవరు ఎన్ని నీతి వాక్యములు పలికినను నిర్లక్ష్యము చేయును. మోహము చేత అసురత్వము, అసురత్వముచేత రాక్షసత్వము చెంది ఘోర కర్మల నాచరించుచు పూర్ణముగ పతనము చెందుట జరుగును.
ఇట్లు కర్తవ్యము వదలిన వానిని కోరిక ఆశ్రయించి, మోహము కలిగించి పతనపు దారిన అధోగతికి చేర్చును. ఎట్టివాడైనను ఈ కురుక్షేత్రమందు కర్తవ్యము నాశ్రయించియే చరించవలెను. కర్తవ్యము వీడినవారు స్వారీ చేయుచున్న గుఱ్ఱపు పగ్గములను వదిలినవాడివలె మార్గము చెడి అగమ్యమగు స్థితిని చేరును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment