గీతోపనిషత్తు -282


🌹. గీతోపనిషత్తు -282 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 14-2

🍀 14-2. మహాత్ములు - మహాత్ములు సర్వ కాలము లందు, సర్వ దేశము లందు, సర్వ రూపము లందు, సర్వ నామము లందు దైవమునే దర్శింతురు. అందరి యందలి దైవమునే కీర్తింతురు. జీవులను పొగడుట అను లౌక్యము వారి వద్ద యుండదు. వారి ప్రయత్నము నిత్యయత్నముగ నుండును. అట్టి నిత్యయత్నమున దైవముతో కూడియుండు వారిని యతులందురు. వారి ప్రయత్నము అత్యంత దృఢమై యుండును. వారి దృష్టి ఎల్లప్పుడును ప్రకృతి యందిమిడి యున్న దైవమును దర్శించుట యందే యుండును. తాము నిర్వర్తించు కార్యములు అంతయు దైవమే. 🍀

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14

తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.

వివరణము : మహాత్ముల లక్షణములు లోపించిన వానిని మహాత్ములుగ గుర్తించ నవసరము లేదు. పై లక్షణము లన్నియు దైవీ ప్రకృతి సంబంధితములు. అట్టి లక్షణములు గలవారు సర్వ కాలములందు, సర్వ దేశము లందు, సర్వ రూపము లందు, సర్వ నామము లందు దైవమునే దర్శింతురు. అందరి యందలి దైవమునే కీర్తింతురు. జీవులను పొగడుట అను లౌక్యము వారి వద్ద యుండదు. వారి ప్రయత్నము నిత్యయత్నముగ నుండును.

అట్టి నిత్యయత్నమున దైవముతో కూడి యుండు వారిని యతులందురు. వారి ప్రయత్నము అత్యంత దృఢమై యుండును. వారి దృష్టి ఎల్లప్పుడును ప్రకృతి యందిమిడి యున్న దైవమును దర్శించుట యందే యుండును. అట్టి సాలోక్య ప్రయత్నమున దైవమునకు సామీప్యమున నుందురు.

దైవ సాయుజ్యమందు వసించి నిత్యకృత్యములు జరుపుచు నుందురు. వారికి తల్లి, తండ్రి, దైవము, మిత్రులు, బంధువులు, సంఘము, కుటుంబము, తాము నిర్వర్తించు కార్యములు అంతయు దైవమే. క్రమముగ అన్యము లేక సమస్తము దైవముగనే దర్శన మగుచుండును. అట్టి అనన్య స్థితి యందు పరమానందభరితులై యుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

No comments:

Post a Comment