శ్రీ శివ మహా పురాణము - 481

🌹 . శ్రీ శివ మహా పురాణము - 481 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 36

🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻

ఋషులు ఇట్లనిరి -

దేవదేవా! మహాదేవా! పరమేశ్వరా! మహాప్రభూ! నీ సేవకులమగు మేము చేసిన కార్యమును గురించి చెప్పెదము. మా మాటలను ప్రీతితో వినుము (23). ఓ మహేశ్వరా! మేనా హిమవంతులకు అనేకములగు మంచి మాటలను, ఇతిహాస దృష్టాంతములను బోధించి సత్యమును తెలుసుకొనునట్లు చేసితిమి. సందేహము లేదు (24). పర్వతరాజు పార్వతిని నీకు ఇచ్చినట్లు మాటను ఇచ్చినాడు. దీనికి విరోధము లేదు. నీవు దేవతలతో, గణములతో గూడి వివాహము కొరకు తరలివెళ్లుము (25). ఓ మహాదేవా! ప్రభో! నీవు పార్వతిని వివాహమాడి పుత్రసంతానమును పొందవలసి యున్నది. కావు శీఘ్రముగా హిమవంతుని గృహమునకు బయలుదేరుము (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

లోకాచారములయందు శ్రద్ధగల మహేశ్వరుడు మిక్కిలి సంతసించిన మనస్సు గలవాడై వారి ఆ మాటలను విని నవ్వి ఇట్లు పలికెను (27).

మహేశ్వరుడిట్లు పలికెను-

మహాత్ములారా! నేను వివాహమును గురించి వినలేదు, చూడలేదు. మీరు పూర్వము వివాహ విధానమును నిర్వచించి యున్నారు. ఆ వివరములను నాకు చెప్పుడు (28).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశుని శుభకరమగు ఆ లౌకిక వచనము విని వారు నవ్వి ఆ దేవదేవుడగు సదాశివునకు ఇట్లు బదులిడిరి (29).

ఋషులిట్లు పలికిరి -

పరివారముతో గూడిన విష్ణువును వెంటనే ప్రత్యేకముగా ఆహ్వానించుడు. మరియు కుమారులతో గూడిన బ్రహ్మను, ఇంద్రదేవుని ప్రీతి పూర్వకముగా ఆహ్వానించుడు (30). మరియు సర్వ ఋషిగణములను, యక్ష గంధర్వ కిన్నర సిద్ధ విద్యాధరులను, అప్సరసల గణములను విలపించుడు (31). ఓ ప్రభూ! వీరిని ఇతరులను అందరిని ఇచటకు సాదరముగా పిలిపించుడు. వారు నీకార్యమును అంతనూ చక్కబెట్టగలరు. సందేహము వలదు (32).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ సప్తర్షులు ఇట్లు పలికి శివుని యాజ్ఞను బడసి, వారందరు శంకరుని మహిమను కొనియాడుతూ ఆనందముతో తమ ధామకు వెళ్లిరి (33).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో సప్తర్షుల ఉపదేశము అనే ముప్పది యారవ అధ్యాయము ముగిసినది (36).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

No comments:

Post a Comment