శ్రీ శివ మహా పురాణము - 476


🌹 . శ్రీ శివ మహా పురాణము - 476 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 35

🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 4 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

జగద్గురువగు ధర్ముడు ఇట్లు పలికి ఆమె ఎదుట నిలబడెను. ఆమె యొక్క పాతివ్రత్యమునకు సంతోషమును, విస్మయమును పొందిన ధర్ముడు ఏమియూ మాటలాడకుండెను (32). ఓ శైలరాజా! అపుడు రాజకుమార్తె, పిప్పలాదుని పత్ని, మహాసాధ్వియగు పద్మకూడ ఆతడు ధర్ముడని ఎరింగి విస్మయమును పొంది ఇట్లు పలికెను (33).

పద్మ ఇట్లు పలికెను -

ఓ ధర్మా! సర్వప్రాణుల సర్వకర్మలకు సాక్షివి అగు నీవు నామనస్సును తెలుసుకొనుటకు ప్రయత్నించుట ఎట్లు పొసగును? ఓ ప్రభూ! నీవు నన్ను మోసగించుచున్నావు (34). ఓ ధర్మా! వేదరూపా! జరిగిన సర్వములో నా అపరాధము లేదు. నేను శపించితిని (35).ఆ శాపమునకు ఇప్పుడు ఎట్టి వ్వవస్ధను చేయవలెను?అని నేను ఆలోచించుచున్నాను. నా మనస్సులో చక్కని మార్గము స్ఫురించినదో, నాకు శాంతి లభించును (36). ఈ ఆకాశము, సర్వ దిక్కులు, వాయువు నశించిననూ పతివ్రత యొక్క శాపము ఎన్నటికీ వ్యర్థము కాదు (37).

ఓ దేవరాజా! నీవు సత్యయుగములో పూర్ణిమనాటి చంద్రునివలె నాల్గు పాదములతో రాత్రింబగళ్లు అన్ని కాలములయందు విరాజిల్లెదవు (38). నీవు నశించినచో సృష్టియే నశించిపోవును. ఏమి చేయవలెనో నాకు తెలియకున్నది. వ్యర్థముగా శపించినాను. అయిననూ, ఉపాయమును చెప్పుచున్నాను (39). ఓ దేవోత్తమా! త్రేతాయుగములో నీకు ఒక పాదము, ద్వాపరములో రెండు పాదములు, కలియుగములో మూడు పాదములు కూడ క్షయమును పొందును. హేవిభో ! (40) కలియొక్క అంతిమభాగములో నీ పాదములన్నియూ ఛిన్నము కాగలవు. మరల సత్యయుగము రాగానే పరిపూర్ణుడవై వెలుగొంద గలవు (41).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Nov 2021

No comments:

Post a Comment