శ్రీ శివ మహా పురాణము - 480


🌹 . శ్రీ శివ మహా పురాణము - 480 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 36

🌻. సప్తర్షుల ఉపదేశము - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ హిమవంతుడు ఇట్లు పలికి తన కుమార్తెను ప్రేమతో వీక్షించి ఆమెను ఆలంకరింపజేసి మహర్షియొక్క ఒడిలో కూర్చుండబెట్టెను (12). ఆ పర్వరాజు మరల ఆ ఋషులతో నిట్లనెను: ఈ భాగమును నేను శివునకు ఇచ్చు చున్నాను. ఇది నిశ్చితము (13).

ఋషులిట్లు పలికిరి-

ఓ పర్వతరాజా! యాచించువాడు శంకరుడు. దాత స్వయముగా నీవే. యాచింపబడునది పార్వతీదేవి. ఇంతకంటె శ్రేష్ఠమగు సన్నివేశము మరి యేమి గలదు? (14) ఓ హిమవంతుడా! నీ ప్రవర్తన నీ శిఖరముల వలె ఉన్నతమై యున్నది. పర్వతములన్నింటికి అధిపతివగు నీవు అందరికంటె శ్రేష్ఠుడవు. నీవు ధన్యుడవు (15).

బ్రహ్మ ఇట్లు పలికెను-

పవిత్ర హృదయముగల ఆ మహర్షులు ఇట్లు పలికి, 'శివునకు సుఖమును ఇమ్ము' అని పార్వతిని ఆశీర్వదించిరి (16). 'నీకు మంగళము కలుగు గాక! శుక్ల పక్ష చంద్రునివలె నీ గుణములు వృద్ధి పొందును గాక!' అని వారు పార్వతిని చేతితో స్పృశించి ఆశీర్వదించిరి (17). ఆ మహర్షులందు ఇట్లు పలికి హిమవంతునకు పుష్పములను, ఫలములను ఆనందముతో సమర్పించి విశ్వాసమును కలిగించిరి (18). గొప్ప శివభక్తురాలు, సాధ్వి, సుందరి అగు అరుంధతి ఆ సమయములో అచట మేనను తన గుణసంపదచే తన వశము చేసుకొనెను (19).

ఆమె మంగళములకు నిలయము ఉత్తమము అగు లోకాచారము ననుసరించి హిమవంతుని మీసములకు పసుపు కుంకుమల లేపమును చేసెను (20). తరువాత వారు నాల్గవ దినమున ఉత్తమ లగ్నమును నిర్ణయించి పరస్పరము సన్మానించుకొని శివుని సన్నిధికి వెళ్లిరి (21). వసిష్ఠాది ఋషులందరు కైలాసమునకు వెళ్లి శివునకు నమస్కరించి అనేక సూక్తులచే స్తుతించి పరమేశ్వరునితో నిట్లనిరి (22).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


25 Nov 2021

No comments:

Post a Comment