గీతోపనిషత్తు -281
🌹. గీతోపనిషత్తు -281 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 14-1
🍀 14-1. మహాత్ములు - మహాత్ముల లక్షణములు : 1. భగవంతుని ఈశ్వరత్వము తెలిసి యుండుట. 2. అన్నిటికి మూలము అతడేయని తెలిసియుండుట. 3. అన్యమేదియు లేదని నిశ్చయముగ తెలిసి యుండుట. 4. నిత్యమతని దర్శించు ప్రయత్నమున నుండుట. 5. దైవదర్శన ప్రయత్నమే దృఢమగు వ్రతముగ నుండుట. 6. అన్నిట, అంతట నిండియున్న దైవమునకు నామ రూపాది భేదములు లేక మనస్సున నమస్కరించు కొనుట. 7. అతని లీలావైభవములు దర్శించుచు నిత్యము కొనియాడు చుండుట. 8. నిత్యము దైవీతత్త్వముతో ప్రజ్జాపరముగ కూడి యుండుట. 9. భక్తి శ్రద్ధలతో ఆ తత్త్వమునకు అత్యంత సమీపమున వసించి యుండుట. 🍀
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14
తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.
వివరణము : ఈ శ్లోకమున వారు నిత్యము దైవ దర్శన యత్నముననే యుందురని (యతంతః), ఆ ప్రయత్నమే దృఢమగు వ్రతముగ ఏర్పరచుకొని యుందురని, (దృఢవ్రతః), సతతము అన్నిట, అంతట ఆ దైవీ తత్త్వమునే దర్శించుచు, కీర్తించుచు నుందురని (సతతం కీర్తయంత?), సమస్తము నందు దర్శింపబడుచున్న దైవమునకు మనస్సున నమస్కరించుచు నుందురని (నమస్యంతి), నిత్యము ఆ విధముగ దైవముతోనే కూడియుందురని (నిత్యయుక్తః), భక్తితో ఈశ్వరునకు అతి చేరువగ వసింతురని (భక్త్యా ఉపాసతే) తెలుప బడుచున్నది.
మహాత్ముల లక్షణములు 13, 14 శ్లోకములలో ఈ క్రింది విధముగ తెలుపబడినవి.
1. భగవంతుని ఈశ్వరత్వము తెలిసి యుండుట.
2. అన్నిటికి మూలము అతడేయని తెలిసియుండుట.
3. అన్యమేదియు లేదని నిశ్చయముగ తెలిసి యుండుట.
4. నిత్యమతని దర్శించు ప్రయత్నమున నుండుట.
5. దైవదర్శన ప్రయత్నమే దృఢమగు వ్రతముగ నుండుట.
6. అన్నిట, అంతట నిండియున్న దైవమునకు నామ రూపాది భేదములు లేక మనస్సున నమస్కరించు కొనుట.
7. అతని లీలావైభవములు దర్శించుచు నిత్యము కొనియాడు చుండుట.
8. నిత్యము దైవీతత్త్వముతో ప్రజ్జాపరముగ కూడి యుండుట.
9. భక్తి శ్రద్ధలతో ఆ తత్త్వమునకు అత్యంత సమీపమున వసించి యుండుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment