🌹. గీతోపనిషత్తు -284 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 15-1
🍀 15-1. తత్వ మొక్కటే ! - దైవమొక తత్త్వము. ఆ మూలతత్త్వ మాధారము గనే సర్వమును పుట్టుచు, పెరుగుచు పూర్ణముగ వృద్ధి చెంది, మరల కృశించి అందులోనికే లయమగు చుండును. అట్టి తత్త్వము నుండి పుట్టినదంతయు అతని రూపమే. మనయందలి సర్వాంగముల యందు మనమే వ్యాపించి యున్నట్లు, విశ్వ మందలి సమస్త అంశముల యందు దైవమే వ్యాప్తి చెంది యున్నాడు. రూప ధ్యానమున ఒక మెలకువ అవసరము. సమస్త సృష్టి వ్యాప్తి చెందియున్న దైవమును ఈ రూపము ద్వారా ఆరాధించు చున్నామని భావింప వలెను. 🍀
జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15
తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.
వివరణము : సనాతన ధర్మమును అద్దము పట్టి చూపించు శ్లోకమిది. దైవము విశ్వతోముఖుడు. అనగా విశ్వరూపుడు. విశ్వముగ గోచరించువాడు. విశ్వమంతయు దైవముతోనే నిండి యున్నది. అతనికి ఇతమిద్ధమగు రూపము లేదు. అన్ని రూపములు అతని నుండి ఏర్పడినవే. నిజమునకు దైవ మతడు కాదు, ఆమె కాదు. రెండును. దైవమొక తత్త్వము. ఆ మూలతత్త్వ మాధారము గనే సర్వమును పుట్టుచు, పెరుగుచు పూర్ణముగ వృద్ధి చెంది, మరల కృశించి అందులోనికే లయమగు చుండును. అట్టి తత్త్వము నుండి పుట్టినదంతయు అతని రూపమే. మనయందలి సర్వాంగముల యందు మనమే వ్యాపించి యున్నట్లు, విశ్వ మందలి సమస్త అంశముల యందు దైవమే వ్యాప్తి చెంది యున్నాడు.
మన శరీరమున ఎవరు ఎక్కడ స్పృశించినను మనలను స్పృశించినట్లే కదా! అట్లే దైవమును ఏ రూపమున భావించినను అతనిని భావించినట్లే. రూప ధ్యానమున ఒక మెలకువ అవసరము. సమస్త సృష్టి వ్యాప్తి చెందియున్న దైవమును ఈ రూపము ద్వారా ఆరాధించు చున్నామని భావింపవలెను. ఆ రూపమునకే పరిమితము కాకుండ, రూపము నిమిత్తముగ విశ్వరూపు నారాధించు చున్నాను అని తెలిసి ఆరాధించ వలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Dec 2021

No comments:
Post a Comment