గీతోపనిషత్తు -285
🌹. గీతోపనిషత్తు -285 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 15-2
🍀 15-2. తత్వ మొక్కటే ! - రూప ధ్యానమునకు రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. 🍀
జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15
తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.
వివరణము : రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. అట్లు జరుగకుండుటకే ఈ శ్లోకమున భగవానుడు ఆరాధనలు ఎన్ని విధములుగ నున్నను, ఆరాధింపబడు తత్త్వ మొక్కటే అని తెలిసి ఆరాధించవలెనని తెలుపుచున్నాడు.
ఆరాధనము లనేకములై యుండ వచ్చును. కాని ఆరాధ్యమగు దైవమొక్కటే అని తెలిసినచో, భక్తుల నడుమ స్పర్ధలు, ఘర్షణలు, పోరాటములు, యుద్ధములు, హత్యలు, మరణములు యుండవు. రాముడైన, కృష్ణుడైన, శివుడైన, విష్ణువైన, లక్ష్మీ సరస్వతులైన, దుర్గ అయిన, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యుడు, గణపతి మరియే ఇతర దేవతలైన, గురువులైన పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. ఇట్టి అవగాహన యున్నపుడు పారశీయులైన, జైనులైన, సిక్కులైన, కిరస్తానీయులైన, ముసల్మానులైన భేదము చూపవలసిన అగత్య ముండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment