శ్రీ శివ మహా పురాణము - 484


🌹 . శ్రీ శివ మహా పురాణము - 484 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 37

🌻. పెళ్ళి హడావుడి - 3 🌻

అదే సమయములో బంధువులకు ఆహ్వానమును పంపి, వారి రాక కొరకు ఉత్సాహముతో ప్రీతితో వేచియుండెను (20). బంధువులు, స్త్రీలు, పిల్లలు, పరిచారకులతో సహా విచ్చేసిరి. ఓ దేవర్షీ! ఇతర పర్వతరాజులు వేంచేసిన తీరును శ్రద్ధతో వినుము (21). శివుని ప్రీతిని పెంపొందించుట కొరకై దేవతలకు నిలయమగు మేరువు దివ్యరూపమును ధరించి విచ్చేసిన తీరును సంగ్రహముగా వర్ణించెదను (22).

అనేక రత్నాభరణములతో ప్రకాశించే బంధువర్గము గలవాడై, విలువైన వస్త్రములను ధరించి, అనేకమణులను సారభూతములగు మహారత్నములను శ్రద్ధతో సంపాదించి వాటిని తీసుకుని (23), ఆ మేరుపర్వతుడు చక్కని వేషముతో అలంకరించుకుని ప్రకాశించువాడై హిమవంతుని రాజధానికి వెళ్లెను. భార్యతో కుమారులతో గూడి మందర పర్వతుడు అనేక శోభలతో నిండినవాడై(24), వివిధములగు బహుమతులను సంగ్రహించుకొని వెళ్ళెను.

దేవతా స్వరూపుడు, విశాల హృదయుడు, వివిధశోభలతో కూడినవాడు అగు అస్తాచలుడు కూడా బహుమానములను తీసుకొని (25) ఆనందముతో విచ్చేసెను. ఉదయాచలుడు గొప్ప రత్నములు, మణులను కూడ తీసుకొని విచ్చేసెను (26).

పెద్ద పరివారము గలవాడు, మహాసుఖము గలవాడు అగు మలయ పర్వతుడు ఆదరముతో విచ్చేసెను (27). గొప్ప విన్యాసము గలవాడు, మహాబలశాలి అగు దర్దురుడు భార్యతో గూడి ఆనందముతో శీఘ్రముగా విచ్చేసెను (28).

ఓ కుమారా! గొప్ప శోభగలవాడు, హర్షముతో నిండిన మనస్సు గలవాడు అగు నిషదుడు కూడా నూతన వస్త్రములను ధరించి హిమవంతుని ఇంటికి వచ్చెను (29).మహాభాగ్యవంతుడగు గంధమాదన పర్వతుడు భార్యలతో, కుమారులతో గూడి ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (30).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


03 Dec 2021

No comments:

Post a Comment