గీతోపనిషత్తు -286


🌹. గీతోపనిషత్తు -286 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 15-3

🍀 15-3. తత్వ మొక్కటే ! - అఖండమగు జ్ఞానము నిరంతరము జిజ్ఞాసువులకు భక్తి శ్రద్ధలతో బోధించుట జ్ఞాన యజ్ఞమగును. ఉపాసన మనగ జీవప్రజ్ఞను దైవప్రజ్ఞ దరిచేర్చుట ఉప ఆసనమనగ, దగ్గర కూర్చుండుట. ఉపవాసమనగ దగ్గరగ వసించుట. ఆరాధనా విధానమేదైనను జీవప్రజ్ఞ పరమేశ్వరుని దరిచేరి యుండ వలెను. అపుడితర విషయములు అట్టి ప్రజ్ఞను మలినము చేయ లేవు. ఉపాసనములు, ఉపవాసములు అర్థవంతముగ నుండ వలెను కాని, వ్యర్ధముగ శ్రమపడుట, దేహమును శుష్కింప జేయుటగ నుండరాదు. 🍀

జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15

తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.

వివరణము : ఇట్టి అఖండమగు జ్ఞానము నిరంతరము జిజ్ఞాసువులకు భక్తి శ్రద్ధలతో బోధించుట జ్ఞాన యజ్ఞమగును. అట్టి జ్ఞాన యజ్ఞమును నిర్వర్తించుచు దైవమును చేరువారున్నారు. అదే విధముగ అపరిమితమగు దైవమును అనేకానేక విధములుగ ఆరాధించుచు, సేవించుచు, భజించుచు, కీర్తించుచు దైవమును చేరువారున్నారు అని ఈ శ్లోకమున తెలుపబడినది. ఇచ్చట ఉపాసన మనగ జీవప్రజ్ఞను దైవప్రజ్ఞ దరిచేర్చుట ఉప ఆసనమనగ, దగ్గర కూర్చుండుట. ఉపవాసమనగ దగ్గరగ వసించుట.

ఆరాధనా విధానమేదైనను జీవప్రజ్ఞ పరమేశ్వరుని దరిచేరి యుండ వలెను. అపుడితర విషయములు అట్టి ప్రజ్ఞను మలినము చేయ లేవు. ఉపాసనములు, ఉపవాసములు అర్థవంతముగ నుండ వలెను కాని, వ్యర్ధముగ శ్రమపడుట, దేహమును శుష్కింప జేయుటగ నుండరాదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Dec 2021

No comments:

Post a Comment