శ్రీ శివ మహా పురాణము - 485
🌹 . శ్రీ శివ మహా పురాణము - 485 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 37
🌻. పెళ్ళి హడావుడి - 4 🌻
గొప్ప సంపదతో గూడియున్న కరవీరుడు, మరియు పర్వతశ్రేష్ఠుడగు మహేంద్రుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (31). గొప్ప శోభతో ప్రకాశించే పారియాత్రుడు భార్యలు, కుమారులు, బంధువులతో గూడి హర్షముతో నిండిన మనస్సు గలవాడై విచ్చేసెను. మణులకు, రత్నములకు నిధియగు ఆతడు వాటిన దోడ్కెని వచ్చెను (32).
పర్వత శ్రేష్ఠుడగు క్రౌంచుడు పెద్దసైన్యమును, పరివారమును, గణములను దోడ్కొని, బహుమానములను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (33). పురుషోత్తమ పర్వతుడు కూడ పరివారముతో గూడి గొప్ప బహుమతులను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (34).
లీలలతో, ఆనందముతో గూడియున్న నీలుడు భార్యలను, కుమారులను దోడ్కొని ధనమును తీసుకొని హిమవంతుని గృహమునకు విచ్చేసెను (35). త్రికూటుడు, చిత్రకూటుడు, వేంకటుడు, శ్రీపర్వతుడు, గోకాముఖుడు మరియు నారదుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (36).
అనేక సంపదలతో గూడినవాడు, పర్వతశ్రేష్ఠుడు, శుభకరుడునగు వింధ్యుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై భార్యతో, కుమారులతో గూడి విచ్చేసెను (37). మహాపర్వతుడు, అనేక కాంతులు గలవాడు అగు కాలంజరుడు మహానందముతో గూడినవాడై, గణములను దోడ్కొని ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (38).
మహాశైలుడు, సర్వపర్వతములకు పైస్థాయిలో ప్రకాశించు ప్రభుడునగు కైలాసుడు మహాహర్షముతో కూడినవాడై దయను చేసి విచ్చేసెను (39). ఓ విప్రా! ఈ ద్వీపములోనే గాక ఇతరద్వీపములలో నున్న పర్వతములు అన్నియూ కూడా హిమవంతుని నగరమునకు విచ్చేసెను (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment