🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 43 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 31. సద్భావము 🌻
భావనల యందు కురుచతనము తగదు. ఉత్తమ భావములే ఉత్తమ మానవుని తయారు చేయగలవు. సంకుచిత భావములు గలవారిని మేము మరుగుజ్జులందుము. మరుగుజ్జులకు చీమల పుట్టలే మహాపర్వతములై అవరోధములు కల్పింప గలవు. ఉత్తమ భావములను మనస్సుయందు సదా నిలుపుకొనుట వలన మనస్సు, బుద్ధియును కూడా దైవీ ప్రజ్ఞకు అందుబాటులో నుండగలవు. మనస్సు - తుచ్ఛము, నీచము, సంకుచితమైన భావములయందు చిక్కుబడినపుడు, ప్రయత్నించి సాధకుడు ఉత్తమ సంగీతమును గానీ, భక్తి ప్రధానమైన కీర్తనలను గానీ, మహాత్ముల ప్రబోధములనుగానీ వినవలెను.
మనస్సు నాకర్షించునట్టి భాగవత, రామాయణాది గ్రంథములను కానీ, సూక్తములను కానీ, సుభాషితములను కానీ పారాయణము చేయవలెను. అట్టి ప్రయత్నమున మాత్రమే మనస్సు చీకటి భావములనుండి బయల్పడి, వెలుగును సంతరించు కొనగలదు. పై సద్భావములయందు విముఖత కలిగిననాడు, సాధకుడు తనను తానుద్దరించు కొను కార్యక్రమమున విఫలుడగును. అతనిని ఎవరునూ రక్షింపలేరు. పై తెలిపిన ప్రయత్నమున మాత్రమే వారు మరల హృదయస్థులై వికసించ గలరు. అట్టి వారికే జీవన వైభవము. అట్టి రుచి లేనివారు మరుగుజ్జులై విభూతి లేక యుందురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
16 Dec 2021
No comments:
Post a Comment